Lemon Farmers losses : రాష్ట్రంలోనే తొలిసారిగా నల్గొండ జిల్లా నకిరేకల్‌లో 3 కోట్ల రూపాయలతో మూడేళ్ల క్రితం నిమ్మ మార్కెట్ ఏర్పాటుచేశారు. నిమ్మకు ప్రత్యేక మార్కెట్ రావడంతో పంటకు మంచి మార్కెట్ ఉంటుందని వివిధచోట్ల నుంచి వ్యాపారులు వచ్చి పంటను మంచి ధరకు కొంటారని రైతులు ఆశించగా అది నెరవేరడం లేదు. దళారులు సిండికేట్‌గా మారి నిమ్మకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
లక్ష కూడా రావట్లే..
నిమ్మకు ఏడాదిలో కొన్ని రోజులే మంచి డిమాండ్ ఉంటుంది. అప్పుడే మంచి ధర వస్తుంది. మిగిలిన కాలమంతా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. డిమాండ్ ఉన్న సమయంలోనూ పంటకు మంచి ధర రాకపోతే తాము ఏమైపోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు లక్షలు పెట్టి సాగు చేస్తే... లక్ష కూడా రావట్లేదని ఆవేదన చెందుతున్నారు. నిమ్మ బస్తా 50, 100 రూపాయలే పలుకుతోందని రైతులు చెబుతున్నారు. కనీసం 300 నుంచి 400 వస్తేనే... పెట్టిన పెట్టుబడి వస్తుందంటున్నారు. ఖరీదుదారులు, కూలీలు మాత్రమే లాభపడుతున్నారని... రైతులు మాత్రం నష్టపోతున్నారని ఆవేదన చెందుతున్నారు.