తెలంగాణ

telangana

ETV Bharat / city

'మునుగోడు' రణం.. సమరానికి కాలు దువ్వుతున్న ప్రతిపక్షాలు..!

Left Parties on Munugode Bypoll: రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయటమే ఒకరి లక్ష్యం. చావో రేవో తేల్చుకునేందుకు మరొకరి పోరాటం. అనూహ్య విజయాలతో ఉత్సాహంతో ఓ పార్టీ. వరుస పరాజయాలతో కష్టాల్లో మరో పార్టీ. ఇద్దరి చెప్పేది ఒక్కటే... అధికారంలోకి రాబోయేది తామేనని. తెరాసకు ప్రత్యామ్నాయం తామేనంటూ చెబుతూ వస్తున్న కాంగ్రెస్‌, భాజపాలు... తమ బలాబలాలు చాటుకునేందుకు మునుగోడు ఉపఎన్నికను మరో వేదికగా మార్చుకుంటున్నాయి. నామినేషన్ల పర్వం ప్రారంభమవటంతో కదనరంగంలోకి దూకేందుకు ఆయా పార్టీల నేతలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు.

munugode bypoll
munugode bypoll

By

Published : Oct 7, 2022, 4:09 PM IST

Updated : Oct 7, 2022, 8:03 PM IST

Left Parties on Munugode Bypoll: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చిన మునుగోడు ఉపఎన్నికను అధికార తెరాసతో పాటు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్‌, భాజపాలు సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రెండు పార్టీల్లో ప్రధానంగా కాంగ్రెస్‌కు ఈ ఉపఎన్నిక జీవన్మరణ సమస్యగా మారింది. 2014లో అధికారం కోల్పోయిన నాటి నుంచి రాష్ట్రంలో వరుస పరాజయాలతో ఆ పార్టీ సతమతమవుతూ వస్తోంది. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో దయనీయ పరిస్థితులను ఎదుర్కొన్న కాంగ్రెస్... హేమాహేమీలున్న నల్గొండ జిల్లాలో జరిగిన నాగార్జునసాగర్‌లో రాజకీయ భీష్మాచార్యుడి లాంటి జానారెడ్డి ఓటమితో కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇదే జిల్లాలో వచ్చిన మరో ఉపఎన్నికలో సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది.

అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ గతంలో లాగా కాకుండా ముందుగానే నిర్ణయం తీసుకుంది. పార్టీ దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని మునుగోడు బరిలోకి దించింది. తాజాగా ఏర్పాటైన గట్టుప్పల్‌ మండలం సహా మొత్తం ఏడు మండలాల్లో సంస్థాగతంగా తమ పార్టీకి ఉన్న బలంపై నేతలు నమ్మకంగా ఉన్నారు. మొత్తం బూతులను ఒక్కో క్టస్టర్‌ పరిధిలోకి పదేసి లెక్కన 30 వరకు విభజన చేసి... సమన్వయకర్తలను ఏర్పాటు చేయడంతో పాటు క్లస్టర్‌ స్థాయిలో ఇంఛార్జిలను, ప్రతి మండలానికి ఇద్దరు నుంచి ముగ్గురు వరకు అటాచ్‌మెంట్‌ ఇంచార్జిలను నియమించారు. వీరు కాకుండా మండలాలకు, మున్సిపాలిటీలకు వేర్వేరుగా సీనియర్‌ నాయకులు ఇంచార్జిలుగా కొనసాగుతున్నారు.

ఆ నేతలకు కీలకం కానున్న ఎన్నిక..వీరంతా రేపటి నుంచి 14వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఉండి ప్రచారం వేగవంతం చేయనున్నారు. అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పటికే ఐదు మండలాల్లో ఇంటింటి ప్రచారం పూర్తి చేయగా మరో రెండు మండలాలు చేయాల్సి ఉంది. పాల్వాయి స్రవంతి తరఫున ఈ నెల 11న రెండు సెట్లు నామినేషన్లు వేయనున్నారు. ఆ తరువాత 14న భారీ జనసమీకరణతో మరొకసారి నామినేషన్లు వేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిలకు ఈ ఎన్నిక కీలకం కానుంది. ప్రత్యర్థిగా భాజపా నుంచి బరిలోకి దిగనున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి... కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ వెంకట్‌రెడ్డి సోదరుడే కావటం, ఇప్పటికే ఆయన సొంత పార్టీ నేతలపై అసంతృప్తితో ఉన్నందున... వెంకట్‌రెడ్డి ప్రచారానికి వస్తారా... లేదా...? అన్న అంశం సందిగ్ధంలోనే ఉంది.

అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భాజపా..రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతూ... ఉపఎన్నికల ఊపుతో ఉన్న భాజపా... రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని భావిస్తోంది. మునుగోడులో విజయం సాధించి రాష్ట్రంలో తెరాసకు తామే ప్రత్యామ్నాయమన్న సంకేతాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని కమలదళం ఆశిస్తోంది. కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరటంతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ నియోజకవర్గంలో భాజపా గతంలో ఎప్పుడూ కనీసం రెండోస్థానాన్ని కూడా దక్కించుకోలేదు. 2009 నుంచి జరిగిన మూడు ఎన్నికల్లో గంగిడి మనోహర్‌రెడ్డి ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేసినా... మూడో స్థానానికే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉన్నా... కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి కానున్నారు. రాజగోపాల్‌… భాజపా కండువా కప్పుకునే సమయంలో పార్టీ అగ్రనేత అమిత్‌షా మునుగోడులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభ కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

'తెరాస – కాంగ్రెస్‌' ఒక్కటే అనే ప్రచారంతో.. రాజగోపాల్‌రెడ్డికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్, ఆర్థిక బలం, కాంగ్రెస్‌ ద్వితీయశ్రేణి నాయకుల మద్దతు, కార్యకర్తల చేరికలతో కమలదళం గెలుపు ఉత్సాహంతో ఉంది... ఉపఎన్నిక సంకేతాలు వెలువడిన నాటి నుంచే నియోజకవర్గంలో సంస్థాగతంగా బలోపేతంపై భాజపా నేతలు దృష్టిసారించారు. పోలింగ్‌ బూత్‌లకు కమిటీలు వేశారు. ఇప్పటికే గ్రామగ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్న రాజగోపాల్‌రెడ్డి...తెరాస ప్రజావ్యతిరేక విధానాలు, రాజీనామాకు కారణాలను వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. త్వరలోనే రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థితత్వాన్ని అధికారంగా ప్రకటించనున్న భాజపా... అగ్రనేతలను నియోజకవర్గానికి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో రాబోయేది తమ ప్రభుత్వమేనని... 'తెరాస – కాంగ్రెస్‌' ఒక్కటే అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తోంది.

మరోవైపు తెజస, ప్రజాశాంతి, బీఎస్పీలు సైతం మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్‌ను బరిలోకి దించుతామని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఇప్పటికే ప్రకటించారు. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా గ్రామగ్రామాన పార్టీల ప్రచారాలు, నేతల వరుస పర్యటనలతో ఇక మునుగోడు రణక్షేత్రాన్ని తలపించనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 7, 2022, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details