KTR on Munugode Bypoll: తెరాస అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నిక కాంట్రాక్టరు అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. డబ్బులు పెట్టి గెలవాలని భాజపా చూస్తోందన్నారు. కేసీఆర్‌కు మిషన్ భగీరథ, మునుగోడు కష్టం తెలుసని కేటీఆర్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏనాడు నియోజకవర్గం గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు.
సీఎం కేసీఆర్ పేదోళ్లను పెద్దోళ్లను చేస్తున్నారు.. మునుగోడు నియోజకవర్గంలోనే లక్షా 13 వేల మందికి రైతు బంధు ఇస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. 10 ఏళ్లకు ముందు మునుగోడు... ఇప్పుడు మునుగోడును ఒకసారి చూడండి అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ పేదోళ్లను పెద్దోళ్లను చేస్తున్నారు.. మోదీ మాత్రం ధనవంతులను మరింత ధనవంతులను చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా ఇస్తున్నామన్న కేటీఆర్.. గుంట భూమి ఉన్న రైతు చనిపోయిన రూ.5లక్షల బీమా ఇస్తున్నామని తెలిపారు. నీటికొరత తీరింది... కేసీఆర్ వల్ల ఫ్లోరోసిస్ పీడ పోయిందని వ్యాఖ్యానించారు. ఫ్లోరోసిస్ నిర్మూలనకు మోదీని 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కోరితే.. మోదీ ఒక్కపైసా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
తెరాసను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా: కేటీఆర్
'కాంట్రాక్టర్ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. రాజగోపాల్‌రెడ్డి ఏనాడు నియోజకవర్గం గురించి పట్టించుకోలేదు. 4 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా రాజగోపాల్‌రెడ్డి చేశారా? 18వేల కోట్ల కాంట్రాక్టు మోదీ గారు ఇచ్చారని రాజగోపాల్‌రెడ్డే చెప్పారు. తనది చిన్న కంపెనీ అని రాజగోపాల్‌రెడ్డే అన్నారు. ఆ చిన్న కంపెనీ రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన పెద్దలు ఎవరు? ఓటుకు వేల రూపాయలు ఇస్తామనే అహంకారంతో ఆ కాంట్రాక్టర్ ప్రవర్తిస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా. అన్ని రకాల అభివృద్ధిలో సంపూర్ణ బాధ్యత తీసుకుంటా. 4 ఏళ్లుగా అభివృద్ధి చేయని మునుగోడులో... మీ గోడు నేను వింటా.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
ఎవరికైనా రూ.15లక్షలు వస్తే వారు మోదీకి ఓటు వేయండి..5 శాతం జీఎస్టీ వేసి చేనేతకు ప్రధాని మోదీ మరణ శాసనం రాశారని కేటీఆర్ ఆరోపించారు. భాజపాకు ఓటు వేస్తే 5 శాతం జీఎస్టీ 12 శాతం అవుతుందని పేర్కొన్నారు. చేనేత మిత్ర పేరుతో కేసీఆర్ రాయితీలు ఇస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్‌కు ఓటు వేద్దామా? పథకాలు ఎత్తేసిన మోదీకి వేద్దామా? అనేది మీరే నిర్ణయించుకోవాలన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా మోదీ ఇబ్బంది పెడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జనధన్ ఖాతా తెరవండి... రూ.15లక్షలు వేస్తానని మోదీ చెప్పారన్న ఆయన.. ఆ డబ్బులు వచ్చినవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఎవరికైనా రూ.15లక్షలు వస్తే వారు మోదీకి ఓటు వేయండని అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. మిర్చి, పకోడి బండి పెట్టుకోవడం కూడా ఉద్యోగాలేనని మోదీ చెప్తున్నారని అన్నారు. దండుమల్కాపూర్‌లో అతిపెద్ద పారిశ్రామిక సమూహం ఏర్పాటు చేశామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: