సూర్యాపేట జిల్లా కేంద్రంలో కోతులను తరమడానికి పురపాలక సిబ్బంది తీసుకొచ్చిన కొండెంగ పట్టణ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న భిక్షం అనే పారిశుద్ధ్య కార్మికుడి మీద దాడి చేసింది. ఈ ఘటనలో కార్మికుడికి తీవ్ర గాయాలై రక్త స్రావమైంది. బాధితుడిని సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కోతులను తరమటానికి పురపాలక సంఘం కొండెంగలను తీసుకువచ్చారు. వీటి వల్ల కోతుల నుంచి కొంతమేరకు ఉపశమనం పొందినప్పటికీ.. ఇవే కొండెంగలు మనుషులపై దాడి చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అధికారులు మొదట రెండు కొండెంగలను తీసుకురాగా.. క్రమంగా వాటి సంతానం పెరిగింది. వాటిలో ఓ కొండెంగ వింతగా ప్రవర్తిస్తూ.. బాటసారులు, పండ్లు, కూరగాయల వ్యాపారుల మీద దాడికి దిగుతున్నది. గతంలో ఓ మద్యం దుకాణంలోకి వెళ్లిన కొండెంగకి ఓ తాగుబోతు గ్లాసులో మద్యం పోసి ఇచ్చాడు. మనిషిలాగే తాగిన కొండెంగ.. ఆ తర్వాత కొద్దిరోజుల నుంచి మనుషులపై దాడి చేస్తుందని స్థానికులు చెపుతున్నారు.