Komatireddy Letter to CM Kcr: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించడంపై సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కు.ని ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే వారి కుటుంబాలను పరామర్శించే తీరిక లేదు కానీ.. ప్రత్యేక విమానంలో బిహార్ రాజధాని పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే సమయం ఉందా అని ప్రశ్నించారు. పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా అని నిలదీశారు. ప్రగతి భవన్ నుంచి 30నిమిషాల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం వెళ్లకుండా రాజకీయాల కోసం పట్నాకు వెళ్లడాన్ని ఏవిధంగా సమర్థించుకుంటారని ధ్వజమెత్తారు.
మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల నష్టం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందామని చూస్తే అలాంటివి కుదరదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 25లక్షల నష్టపరిహారం ఇవ్వడంతోపాటు వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 30మంది బాధిత మహిళల ఆరోగ్యానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని.. వారికి పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.