Rajagopal Reddy on CM Kcr: రాష్ట్రంలో భాజపాతోనే కేసీఆర్ దుర్మార్గ పాలన అంతమవుతుందని భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విశ్వాసం వ్యక్తంచేశారు. నియోజకవర్గంలో గడియారాలు పంచుతున్నారని.. ఇంటికి కిలో బంగారం ఇచ్చినా.. తెరాస ఓటమి ఖాయమని ఆయన అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భాజపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన... ఉపఎన్నిక వస్తే ప్రభుత్వానికి అభివృద్ధి పనులు గుర్తుకొస్తాయని విమర్శించారు. నియోజకవర్గంలో మూడున్నర ఏళ్లుగా జరగని అభివృద్ధి తన రాజీనామాతో జరుగుతుందని.. ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే ఉప ఎన్నికలో కేసీఆర్కు మునుగోడు ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ మునుగోడు అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు.. ఉపఎన్నికలు రాగానే మీటింగ్లు పెట్టి.. రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అంతం భాజపాతోనే సాధ్యమన్నారు. గతంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసను ఎదుర్కొనే పార్టీ భాజపానే అని నిరూపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీని నడిపించే అధ్యక్షుడు సరిగ్గా లేరని అందుకే ఆ పార్టీ రోజురోజుకు పడిపోతుందని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడు నియోజక వర్గంలోని అన్ని మండలాల నుంచి 1500 మంది ముఖ్య కార్యకర్తలు ఆ నిర్ణయం మేరకే భాజపాలో చేరారని తెలిపారు.