Farmers concern in Nalgonda: నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో వరి ధాన్యం రైతులు మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. రైతులు తెచ్చిన ధాన్యానికి రకరకాల కారణాలు చెబుతూ.... మిల్లర్లు అరకొర రేటు కడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మిర్యాలగూడ రైస్ మిల్లులకు ప్రసిద్ధి. నిన్న, మొన్నటి వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మిల్లర్లు అడిగిన ధరకే ధాన్యాన్ని అమ్మే పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు. యాసంగిలో దొడ్డు రకం బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయమని చెప్పడంతో సన్న రకం బియ్యాన్ని పండించడానికే ఎక్కువ మొగ్గు చూపాము.
ప్రభుత్వం 1,960 రూపాయలు మద్దతు ధర ప్రకటించినా... రైతులకు 1800 కూడా రావడం లేదు. మిల్లర్లు సిండికేట్‌గా మారి నాణ్యత చూడకుండానే ధాన్యానికి ధర కడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వారం క్రితం క్వింటాకు 2వేల100 వరకూ చెల్లించి... కోతలు పెరిగి ధాన్యం రావడంతో 300 రూపాయలు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1850, 1830 ధరకే కొనుగోలు చేస్తుండటంతో... పెట్టుబడి కూడా రావడం లేదని అన్నదాతలు గోడు వెళ్లబోసుకుంటున్నారు.