దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.700 కోట్ల వరకు ఖర్చయింది. భూ సేకరణ, మిగిలిన పనులకు మరో రూ.400 కోట్ల వరకు ఖర్చు కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి కల్లా పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంగా పనుల్లో వేగం పెంచారు. షిర్డీ, అక్షరధామం ఆలయాలలో నిర్మించిన విధంగా ఇత్తడి పైపులతో, ఆకర్షణీయంగా క్యూలైన్లను నిర్మించనున్నారు.
చెన్నైలో బంగారు పూత పనులు
ఇప్పటికే పూర్తైన ఆరు రాజగోపురాలపై బిగించనున్న కలశాలకు స్వర్ణ పూత పనులను చెన్నైలో చేపట్టారు. విమాన గోపురంపై స్వర్ణ పూత పనులను త్వరలోనే చేపట్టనున్నారు.
పనులు ఎందాకా వచ్చాయంటే...
- ప్రాజెక్టులో ప్రధానమైన గర్భాలయ పనులు ఓ రూపునకు వచ్చాయి.
- రాజగోపురాలన్నింటికీ టేకు ద్వారాల బిగింపు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.
- కొండ పైకి వెళ్లేందుకు మెట్ల మార్గం, ఈ మార్గంలో నిర్మిస్తున్న గాలిగోపురం పనులు పూర్తికావొచ్చాయి.
- గర్భాలయ ప్రవేశ ద్వారం పక్కనే మందిర దృశ్యీకరణ, ఆంజనేయస్వామి విగ్రహం పక్కనే రెయిలింగ్ పనులకు తుది మెరుగులు దిద్దుతున్నారు.
- తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళ్లే మార్గంలో రెండు వైపులా భక్తాగ్రేసరులు, ఆధ్యాత్మిక చిహ్నాలను పొందుపర్చారు.
- పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా చేపట్టిన శయన, బ్రహ్మోత్సవ మండపాలతో పాటూ అష్టభుజ మండప ప్రాకారాలు నిర్మాణంలో ఉన్నాయి.
- గర్భాలయంలో బలిపీఠం, ధ్వజస్తంభం, గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం పనులను చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
సాలహారాలతో శివాలయం నిర్మాణం
ప్రధానాలయానికి అనుబంధంగా ఉన్న శివాలయ పునర్నిర్మాణం సాలహారాలతో సిద్ధమవుతోంది. ప్రధాన మందిరం, ముఖ మంటపం కృష్ణశిలతో నిర్మిస్తున్నారు. నవగ్రహ మంటపం, యాగశాల, వినాయక మందిరం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. త్రితల రాజగోపురంతో ఆలయ ప్రహరీ సాలహారాలతో రూపొందించారు.