తెలంగాణ

telangana

ETV Bharat / city

నారసింహుడు కరుణించినా, ప్రసాదం కరువాయే - యాదాద్రిలో స్వామి వారి ప్రసాదం కోసం క్యూలో భక్తులు

Devotees problems in Yadadri యాదాద్రి పునః ప్రారంభం తర్వాత యాదాద్రీశుని నిజరూప దర్శనం చేసుకుని తరించాలనుకునే భక్తులకు.. చేదు అనుభవమే ఎదురవుతోంది. మూలమూర్తుల దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. దీంతో కనీస సదుపాయాలు, పర్యవేక్షణ లేక భక్తులు సతమతమవుతున్నారు. ఆదివారం యాదాద్రి క్షేత్రానికి సుమారు 40 వేల మంది భక్తులు రాగా వారికి సరిపడా లడ్డూ ప్రసాదాన్ని దేవస్థానం అధికారులు అందించలేకపోయారు. దీంతో ఆలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Yadadri
Yadadri

By

Published : Aug 29, 2022, 5:33 PM IST

Updated : Aug 29, 2022, 7:24 PM IST

Devotees problems in Yadadri: కృష్ణశిలా వైభవంతో వెలుగొందుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో అసౌకర్యాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సెలవులు, వారాంతపు రోజుల్లో వివిధ ప్రాంతాల నుంచి భక్తజనులు పోటెత్తుతున్నారు. యాత్రికుల రాక పెరిగిన ప్రతిసారీ తిప్పలూ పెరుగుతున్నాయి. ఆదివారం యాదాద్రి క్షేత్రానికి సుమారు 40 వేల మంది భక్తులు రాగా వారికి సరిపడా లడ్డూ ప్రసాదాన్ని దేవస్థానం అధికారులు అందించలేకపోయారు. తక్కువ కౌంటర్ల ద్వారా విక్రయాలు జరపడంతో నిరీక్షించలేక, ఓపిక నశించి, అసహనానికి గురైన భక్తులు అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రసాద విక్రయ కేంద్రంలోని కౌంటర్ తలుపులు తెరిచేందుకు, తోసుకురావడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో ఎస్పీఎఫ్ పోలీసులు, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకొని భక్తులను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.

మరోవైపు కొండపైకి టికెట్టుపై భక్తుల వాహనాలను అనుమతించడం, మరమ్మతుల కారణంగా ఒకే ఘాట్ రోడ్డుపై రాకపోకలు సాగించడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో భక్తులు మధ్యలోనే బస్సులు, కార్లు దిగి నడక ద్వారా కొండపైకి చేరారు. ఆలయంలో తరచూ విద్యుత్ అంతరాయం కలిగి చీకట్లు అలముకోవడంతో యాత్రికులు ఇబ్బందిపడ్డారు. ఎప్పటిలాగే దివ్యాంగులు, వృద్ధులు స్వామి దర్శనం కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాదాద్రి దేవస్థానంలోని లడ్డూ ప్రసాదం తయారీ యంత్రం చెడిపోయి నెల రోజులవుతోంది. ఈ యంత్రాలను ఆలయ ఉద్ఘాటన సమయంలోనే ప్రారంభించారు. ఆరు నెలల్లో మరమ్మతుకు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయంగా అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి సిబ్బంది తయారు చేస్తున్న లడ్డూలను కొండపైకి తరలిస్తున్నారు. వారాంతపు సెలవైన ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో లడ్డూలకు కొరత ఏర్పడుతోంది. పులిహోర, వడ ప్రసాదం మాత్రం యంత్రాలతో తయారు చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం దొరకకపోవడంతో కొందరు భక్తులు పులి హోరతోనే సరిపుచ్చుకొని వెళ్తున్నారు. యాదాద్రి లడ్డూ పై భక్తజనులకు అమితమైన విశ్వాసం ఉంది. స్వామివారి ప్రసాదం అందకపోవడంపై వారు అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నెల నుంచి మరమ్మతులు పూర్తిచేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు.

నారసింహుడు కరుణించినా, ప్రసాదం కరువాయే

'యాదగిరీశుడి లడ్డూ ప్రసాదాన్ని మహిమాన్వితంగా భావిస్తాం. యాదాద్రికి వెళ్లొచ్చామని తెలిసిన ఇరుగుపొరుగువారు, బంధువులు, సన్నిహితులు స్వామివారి ప్రసాదాన్ని ప్రత్యేకంగా అడిగి స్వీకరిస్తారు. స్వామివారిని దర్శించుకొని ప్రసాదం కోసం వెళ్తే దొరకకపోవడం భక్తులకు బాధాకరమే. యాత్రికులు ఇబ్బందులు పడకుండా సరిపడా ప్రసాదంతో పాటు వసతులు కల్పించాలి.'-శంకర్ భక్తుడు, హైదరాబాద్

'యాదాద్రి దేవస్థానం లడ్డూ ప్రసాద యంత్రం చెడిపోవడంతో మరమ్మతులు చేయిస్తున్నాం. ఈ నేపథ్యంలో పాతగుట్ట దేవస్థానం నుంచి లడ్డూ ప్రసాదాన్ని ఇక్కడికి వాహనాల ద్వారా చేర్చుతున్నాం. భక్తుల రద్దీ కారణంగా కొరత ఏర్పడడం, సకాలంలో చేరకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యంత్రం త్వరలో బాగవుతుంది. అంతలోపు భక్తులు సహకరించాలి.' -గీతారెడ్డి, యాదాద్రి ఈవో

ఇవీ చదవండి:

Last Updated : Aug 29, 2022, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details