తెలంగాణ

telangana

ETV Bharat / city

వడివడిగా దండుమల్కాపురం హరిత పారిశ్రామిక పార్కు నిర్మాణ పనులు - DanduMalkapuram Green Industrial Park news

కాలుష్యరహిత పారిశ్రామికవాడల అంకురార్పణ దిశగా చేపట్టిన దండు మల్కాపురం హరిత పారిశ్రామిక పార్కులో... నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. సంస్థల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తుండటంతో... ప్రాంగణాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు దశల్లో భూసేకరణ చేపట్టిన అధికారులు... ఇప్పుడు మరో దశలో భూముల్ని తీసుకునే యోచనలో ఉన్నారు.

జోరుగా దండుమల్కాపురం హరిత పారిశ్రామిక పార్కు నిర్మాణ పనులు
జోరుగా దండుమల్కాపురం హరిత పారిశ్రామిక పార్కు నిర్మాణ పనులు

By

Published : Jan 10, 2021, 4:20 AM IST

Updated : Jan 10, 2021, 5:51 AM IST

వడివడిగా దండుమల్కాపురం హరిత పారిశ్రామిక పార్కు నిర్మాణ పనులు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులో... నాలుగో దశ భూసేకరణపై అధికారులు దృష్టిసారించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. తొలుత 12 వందల ఎకరాల్లోనే స్థాపించాలని నిర్ణయించినా... పారిశ్రామికవేత్తల ఆసక్తి మేరకు మరింత విస్తరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే మూడు దశల్లో 1,087 ఎకరాలు సేకరించి రూ.118.82 కోట్లను నిర్వాసితులకు చెల్లించగా... తాజాగా నాలుగో దశలో భూమి తీసుకోబోతున్నారు. సుమారు 232 మంది రైతుల నుంచి... 687 ఎకరాల భూసేకరణకు సంబంధించిన సర్వే పనులను పూర్తి చేశారు. త్వరలోనే ప్రకటన జారీ చేసే అవకాశముంది. వచ్చే ఫిబ్రవరి నాటికి సదరు భూమిని పరిశ్రమ పార్కుకు కేటాయించి... వీలైనంత తొందరగా పరిహారం పంపిణీ చేయాలని భావిస్తున్నారు.

300 ఎకరాలు కేటాయించాలని..

పారిశ్రామిక పార్కుకు సమీపంలో ఉన్న 300 ఎకరాలను తమకు కేటాయించాలని రెవెన్యూ అధికారుల్ని టీఎస్​ఐఐసీ కోరుతోంది. అందుకు సంబంధించిన భూ సమగ్ర వివరాలను సైతం అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు హరిత పారిశ్రామిక పార్కులో రూ. 30కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. గతంలోనే రూ. 110కోట్లు వెచ్చించి రహదారులు, నీటి వసతి, మురుగు కాల్వలతోపాటు విద్యుత్తు ఉపకేంద్రం సౌకర్యాలు కల్పించారు. లక్షా 70 వేల చదరపు అడుగుల స్థలంలో ఆడిటోరియం, సూపర్ మార్కెట్లు, బ్యాంకులు, నైపుణ్య శిక్షణ కేంద్రం, పరిశ్రమల విడిభాగాల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.


అనేకమందికి ఉపాధి

పారిశ్రామిక పార్కులో ఇప్పటివరకు సుమారు 600 మంది సూక్ష్మ, చిన్నతరహా పారిశ్రామిక వేత్తలకు స్థలాలు కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్యాకేజింగ్, ఇంజినీరింగ్ పరికరాల తయారీ పరిశ్రమల భవనాలు సిద్ధం కాగా... ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. పారిశ్రామిక పార్కు ద్వారా ఇప్పటికే అనేకమందికి ఉపాధి లభిస్తుండగా..భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ పనులు త్వరగా పూర్తిచేసి పార్కును మరింత విస్తరించాలని టీఎస్​ఐఐసీ భావిస్తోంది.


ఇవీ చూడండి:పశువులకూ హాస్టళ్లు... పాడిపరిశ్రమ అభివృద్ధికి సోపానాలు

Last Updated : Jan 10, 2021, 5:51 AM IST

ABOUT THE AUTHOR

...view details