లాక్డౌన్ పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న దరిమిలా... పంటను అమ్ముకునేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్నదాతలు ఇప్పుడిప్పుడే మార్కెట్ల బాట పడుతున్నారు. మరికొందరు ఇంకో నాలుగైదు రోజుల్లోపు ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో... అకాల వర్షం వారిపై పిడుగులా పడింది. ఉమ్మడి జిల్లాలో రెండు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేస్తుండగా... ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 15 వందల ఎకరాల్లో వరి పనికిరాకుండా పోయింది.
వరి తుడిచిపెట్టుకు పోయింది
ఖరీఫ్‌లో కురిసిన వర్షాలకు చాలా ఏళ్ల తర్వాత పెద్ద పెద్ద చెరువులు కూడా జలకళ సంతరించుకున్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలో గతానికి భిన్నంగా ఈ యాసంగిలో పెద్దఎత్తున వరి సాగు వేశారు. కానీ పంట చివరి దశలో అకాల వర్షం రైతన్నను నిలువునా ముంచేసింది. వలిగొండ మండలంలో వెయ్యి 30 ఎకరాల్లో, పోచంపల్లిలో 4 వందల ఎకరాల్లో వరి తుడిచిపెట్టుకు పోయింది. యాదాద్రి జిల్లాలో మొత్తంగా 640 మంది రైతులు పంటను కోల్పోవాల్సి వచ్చింది. అటు నల్గొండ జిల్లాలోని పెద్దవూర, పెద్దఆడిశర్లపల్లి, హాలియా సహా దేవరకొండ డివిజన్లోని కొన్ని ప్రాంతాల్లో... ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది.