Munugode By Poll Candidate congress candidate : మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేసింది. అభ్యర్థిగా స్రవంతిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ పరిస్థితుల్లో మునుగోడు టికెట్ రావడమనేది ఒక బాధ్యత: పాల్వాయి స్రవంతి - palvai sravanthi
12:51 September 09
ఈ పరిస్థితుల్లో మునుగోడు టికెట్ రావడమనేది ఒక బాధ్యత: పాల్వాయి స్రవంతి
ఉప ఎన్నికకు కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు పోటీ పడ్డారు. స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ తదితరులు టికెట్‌ను ఆశించారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారితో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలపై ఏఐసీసీకి నివేదిక పంపించారు. టీపీసీసీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది.
భాజపా అభ్యర్థిగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం మునుగోడులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా సమక్షంలో భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డినే భాజపా తమ అభ్యర్థిగా ప్రకటించనుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెరాస అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడంపై పాల్వాయి స్రవంతి సంతోషం వ్యక్తం చేశారు.
'నన్ను మునుగోడు అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉంది. నాకు సహకరించిన పార్టీ అధిష్ఠానానికి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, జిల్లా నాయకులు, పార్టీ సీనియర్ నాయకులకు పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ పరిస్థితుల్లో టికెట్ రావడమనేది ఒక బాధ్యత. పార్టీ ఆశల్ని వాళ్ల భుజాల మీద మోస్తున్నంత పని. ఇటువంటి సమయంలో అందరూ సహకరించి ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. వలసల విషయంలో కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలు ఎవరూ పార్టీ మారడం లేదు. పార్టీకి సానుకూలంగా ఉన్నవాళ్లు ఎవరూ పార్టీలో నుంచి వెళ్లడం లేదు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్యానికే ఒక ప్రశ్న. ఎందుకంటే కేవలం ధనబలం, అధికార బలంతో రెండు పార్టీలు వస్తున్నప్పుడు ప్రజా బలంతో వెళ్లే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటప్పుడు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీనే అదరిస్తారని నమ్ముతున్నాను.'-పాల్వాయి స్రవంతి, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి
ఇవీ చదవండి: