కొత్త ఏడాదిలో యాదాద్రి ఆలయాన్ని పునఃప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో నూతన ఆలయంలో పూజలు ప్రారంభించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఐదేళ్ల కిందట ప్రారంభమైన యాదాద్రి పనులు తుదిదశకు చేరుకున్నాయి. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా.. వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా పూర్తైంది. రంగులు వేయడం వంటి ఇతర పనులు కొనసాగుతున్నాయి.
ఇటీవల యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి.. అవసరమైన సూచనలు చేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే వారు కళ్యాణకట్టలో తలనీలాలు ఇవ్వడం, పుష్కరణిలో స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొండపైన బస్ బే నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కేవలం దేవస్థానం బస్సులనే.. గుట్టపైకి అనుమతించాలని నిర్ణయించారు.