సాగర్ ఎన్నిక మనకు అత్యంత ప్రతిష్ఠాత్మకం. ఇప్పటిదాకా అన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయి. ప్రచారం బ్రహ్మాండంగా సాగుతోంది. ప్రతీ ఓటరు నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు, నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారు.ప్రచారానికి అయిదు రోజులే గడువున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలి. అందరి మద్దతునూ కూడగట్టాలి. - కేసీఆర్, ముఖ్యమంత్రి.
సాగర్ అభివృద్ధి తెరాస పుణ్యమే
విపక్షాల వాదనల్లో పస లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సాగర్ అభివృద్ధి తెరాస పుణ్యమన్నారు. నియోజకవర్గంలో 95 శాతానికిపైగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే ఉన్నారని వివరించారు. నాగార్జునసాగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు పచ్చగా కళకళలాడుతోందంటే అది ప్రభుత్వ ఘనతే అని వెల్లడించారు. నియోజకవర్గానికి సాగునీటితోపాటు తాగునీటినిచ్చి ఫ్లోరైడ్‌ను తరిమి కొట్టామని గుర్తుచేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించామని... ఎన్నికల ప్రచారంలో విపక్షాలకు చెప్పుకోదగ్గ అంశం ఒక్కటీ కూడా లేదని అన్నారు కేసీఆర్. అవాకులు, చెవాకులు మాట్లాడితే ప్రజలు ఏమాత్రం నమ్మరని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.