ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు ఉప ఎన్నికలు.. విభిన్న నేపథ్యాలు - మునుగోడు ఉప ఎన్నిక
Munugode by poll: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. గతంలో హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు హోరాహోరీగా జరగగా తెరాస విజయకేతనం ఎగరేసింది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు గెలుపు కోసం చెమటోడుస్తున్నాయి. రసవత్తరంగా జరుగుతున్న ప్రచార వేఢీని దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఉప ఎన్నిక
By
Published : Oct 11, 2022, 11:33 AM IST
Munugode by poll: రాష్ట్ర రాజకీయాలను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉప ఎన్నికలు వేడెక్కిస్తుంది. గతంలో హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తెరాస విజయభేరి మోగించింది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు గెలుపు కోసం చెమటోడుస్తున్నాయి. రసవత్తరంగా జరుగుతున్న ప్రచార వేఢీని దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
హుజూర్‌నగర్‌లో ప్రచార హోరు తక్కువ...హుజూర్‌నగర్ 2018లో గెలుపొందిన నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అదిష్ఠానం నిర్ణయం మేరకు ఎంపీగా పోటీకి దిగారు. గెలిచిన తర్వాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఆ స్థానానికి 2019 అక్టోబర్‌లో ఉప ఎన్నిక జరిగింది. తెరాస ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి పోటీ చేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్రంలోని వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పదవులలో ఉన్న ప్రజా ప్రతినిధులను మోహరించి తెరాస ఇంటింటి ప్రచారం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిఘా పెంచటంతో ఆయా పార్టీలు ప్రచార ఆర్భాటాలను తగ్గించి ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ ఆర్భాటాలకు పోకుండా ప్రత్యేక ఇన్‌ఛార్జులతో మంత్రుల రోడ్‌షోలు, గ్రామసభలు నిర్వహించటంతో ప్రచారం చేపట్టారు. అదే స్థాయిలో కాంగ్రెస్ తమకున్న ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జాతీయ నాయకులు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు. భాజపా, ఇతర అభ్యర్థుల ప్రచారాలు జరిగినా.. కాంగ్రెస్, తెరాస హోరాహోరీ ముందు అంతంత మాత్రంగానే నిలిచాయి. చోటా మోటా నాయకుల కొనుగోళ్లు, ఓట్ల కొనుగోళ్లు మాత్రం ముమ్మరంగా జరిగిన ఈ ఉత్కంఠ భరిత పోరులో తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు.
మునుగోడులో త్రిముఖ పోటీ..ఇప్పటి వరకు జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాస మధ్యే పోటీ జరిగింది. కానీ ఈ సారి భాజపాతో కలిపి త్రిముఖ పోటీ నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపా తీర్థం తీసుకొని కాంగ్రెస్‌కు, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయనే భాజపా అభ్యర్థిగా రంగంలో దిగారు. దీంతో భాజపా అనూహ్యంగా తెరాస, కాంగ్రెస్‌లకు గట్టి పోటీ ఇస్తుందని రాజకీయ వర్గాల విశ్లేషణ. తెరాస కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని, కాంగ్రెస్ పాల్వాయి స్రవంతిని రంగంలో దించింది. 2024లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరుగుతున్న ఎన్నిక కావటంతో మూడు పార్టీలు ఎవరికి వారు గెలుపు కోసం విశేష కృషి చేస్తున్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపా ఎన్నికల ప్రచారాన్ని ఒకే విధంగా చేపట్టాయి. వార్డులకు, గ్రామాలకు, మండలాలకు ప్రత్యేక ఇన్‌ఛార్జిలను నియమించుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. త్వరలో తెరాస సీఎం సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతుండగా భాజపా, కాంగ్రెస్ సైతం భారీ బహిరంగ సభలకు సమాయత్తం అవుతున్నాయి.
నాగార్జునసాగర్‌లో పోటీ ప్రతిష్ఠాత్మకం...నాగార్జునసాగర్ 2018 ఎన్నికలలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డిపై నోముల నర్సింహయ్య పోటీ చేసి గెలుపొందారు. నర్సింహయ్య అనారోగ్యంతో మృతిచెందడంతో 2021 ఏప్రిల్‌లో ఉప ఎన్నిక జరిగింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో గెలిచిన ఉత్సాహంలో ఉన్న తెరాస తిరిగి నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కుమార్‌ను రంగంలోకి దించింది. ఆయన మీద కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డి పోటీకి దిగారు. అనుభవం, నియోజకవర్గంతో అన్ని రకాలుగా అనుబంధం ఉన్న జానారెడ్డి ఓడించేందుకు తెరాస హుజూర్‌నగర్ ఎన్నిక వ్యూహాన్నే అమలు చేసింది. అర్భాటాలు లేకుండా ఇంటింటి ప్రచారాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అదే స్థాయిలో కాంగ్రెస్ సైతం పోరాటం చేసింది. ఈ ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జానారెడ్డిని ఓడించి తమ సీటును నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో తెరాస చేసిన కృషి ఫలించడంతో విజయఢంకా మోగించుకుంది.