తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..

కన్న తల్లిని ఆస్తి కోసం హింసించారు ఆ బిడ్డలు. కడుపున పుట్టిన పిల్లలే బెదిరింపులకు దిగితే.. భయపడిన ఆ తల్లి ఓ ఆలయంలో తలదాచుకుంది. ఓ వైపు కరోనా వైరస్‌ విజృంభణ.. మరో వైపు చలి, వర్షంతోపాటు దోమల మధ్య రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆమెను స్థానికులు అనాథ ఆశ్రమంలో చేర్చించారు. ఇంతకి ఆతల్లికి వచ్చిన కష్టమేంటి? ఆ బిడ్డలు చేసిన పనేంటి?

ఆస్తికోసం బిడ్డల కుట్ర.. అందరూ ఉన్నా అనాథైన తల్లి
ఆస్తికోసం బిడ్డల కుట్ర.. అందరూ ఉన్నా అనాథైన తల్లి

By

Published : Jul 10, 2020, 9:52 AM IST

Updated : Jul 10, 2020, 12:30 PM IST

ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం లింగోటం గ్రామానికి చెందిన అరవై ఐదేళ్ల వృద్ధురాలు జెల్లా సంపూర్ణకు ఇద్దరు కుమారులు శ్రీనివాస్‌, జ్ఞానేశ్వర్‌. వివాహమైన తర్వాత వీరిద్దరూ తల్లి నుంచి వేరుపడి నివాసం ఉంటున్నారు. భర్త కిష్టయ్య పదేళ్ల క్రితం మృతి చెందడంతో తనకున్న భూమిని సాగు చేసుకుంటూ, కూలీనాలీ చేసుకుంటూ డబ్బులు కూడబెట్టుకొని ఎవరిపై ఆధారపడకుండా సంపూర్ణ జీవితం గడుపుతున్నారు. ఆమె వద్ద బంగారు ఆభరణాలు, వడ్డీలకు ఇచ్చిన అప్పు పత్రాలు, ఇతర ఆస్తి పత్రాలు ఉండటంతో కుమారులు, కోడళ్లు వాటిని కాజేయడానికి వేధింపులకు దిగారు. ఆ తర్వాత కుమారులిద్దరూ తల్లిని చితకబాది బలవంతంగా వాటిని లాక్కున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె పోలీసులకు, ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో రెచ్చిపోయిన కుమారులు మళ్లీ పోలీసులు, అధికారుల వద్దకు వెళ్తే చంపేస్తామంటూ ఆమెను హెచ్చరించారు.

ప్రాణభయంతో ఆ తల్లి ఊరు విడిచి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం చెంతకు చేరుకుంది. ఓ వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుండగా.. మరోవైపు చలి, వర్షంతోపాటు దోమల మధ్య రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఉదయం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆమెను స్థానికులు గుర్తించి ఆరా తీశారు. తర్వాత వంగపల్లిలోని అమ్మఒడి అనాథాశ్రమానికి సమాచారం ఇచ్చారు. ఆశ్రమ నిర్వాహకులు శంకర్‌, దివ్య అక్కడికి చేరుకొని వృద్ధురాలు సంపూర్ణ వివరాలు తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఆశ్రమానికి తీసుకెళ్లారు. చౌటుప్పల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చామని, జెల్లా సంపూర్ణ కుమారులతో మాట్లాడిన తదుపరి చర్యలు తీసుకుంటామని గుట్ట సీఐ పాండురంగారెడ్డి.

ఇవీ చూడండి:ప్రమాదంలో పర్యావరణం.. కాగితాల్లోనే నిబంధనలు

Last Updated : Jul 10, 2020, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details