తెలంగాణ

telangana

ETV Bharat / city

నయీం భయం ఎంతంటే.. - latest news on nayeem

నయీం.. హతమై మూడేళ్లు గడుస్తున్నా.. ఆ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. గ్యాంగ్​స్టర్​ వల్ల నిరాశ్రయులయిన వారు, బాధితులుగా మారిన వారి పరిస్థితి ఇప్పటికీ దయనీయంగానే ఉంది. భయపెట్టి.. బెదిరించి.. కంటికి కనిపించిన ఆస్తులన్నీ కబ్జా చేశాడు. ఎదురుతిరిగిన వారిని అంతమెందించాడు. ఏకంగా 27 హత్యా అభియోగాలు నయీంపై ఉన్నాయంటే నాటి దుశ్చర్యలు ఎంత దారుణంగా ఉన్నాయో.. ఊహించుకోవచ్చు. పోలీసుల ఎన్​కౌంటర్​లో హతమైన తర్వాత బాధితులంతా సంతోషించారు. తమ ఆస్తులు తమకు తిరిగొస్తాయని ఆశపడ్డారు. వారికి ఎదురుచూపులే మిగిలాయి. మూడేళ్లుగా దర్యాప్తు కొనసాగుతుండడం వల్ల చాలా మంది బాధితులు తమ ఆస్తులు వెనక్కి వస్తాయనే ఆశలు వదులుకున్నారు.

nayeem
నయీం భయం ఎంతంటే..

By

Published : Feb 1, 2020, 2:33 PM IST

Updated : Feb 1, 2020, 2:44 PM IST

నయీం భయం ఎంతంటే..

నయీం... తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో అనేక ప్రాంతాలకు తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన కరడుగట్టిన నేరస్థుడు. 2016 ఆగస్టు 8న షాద్​నగర్​ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్​లో హతమయ్యాడు. అప్పటి వరకు నయీం భయంతో గడిపిన వారందరూ బయటకురావడం మొదలు పెట్టారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు ముందు ఏకరవుపెట్టారు. తమ ఆస్తులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

250 కేసులు నమోదు..

బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. బాధితులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక ఫోన్​ నంబర్లు కేటాయించింది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అమెరికాతోపాటు ఇతర దేశాల నుంచీ ఫిర్యాదులందాయి. తమ ఆస్తులు కొల్లగొట్టాడని కొందరు.. తమ వారిని అంతమొందించాడని మరికొందరు ఫిర్యాదులు చేశారు. ఏకంగా 250 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 220 కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలు చేశారు.

1.67 లక్షల చదరపు గజాల ఇళ్ల స్థలాలు కబ్జా..

మూడేళ్లవుతున్నా దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. 21 కార్లు, 26 ద్విచక్రవాహనాలు, రూ.2.95 లక్షల నగదు, 1000 ఎకరాల వ్యవసాయ భూమి, 27 ఇళ్లు, 1.67 లక్షల చదరపు గజాల ఇళ్ల స్థలాల్ని కబ్బా చేశాడని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. అన్ని కేసుల దర్యాప్తు పూర్తి చేసి.. అభియోగ పత్రాలు దాఖలు చేస్తేనే గాని న్యాయ విచారణ సాధ్యం కాదు. బాధితుల ఆస్తులు నయీం కబ్బా చేసినట్లు నిరూపితమైతే తప్ప తిరిగి అప్పగించడం సాధ్యం కాదు. ఇదంతా ఎన్నేళ్లు పడుతుంతో తెలియడం లేదు.

సాంకేతిక సమస్యలు..

నయీం ఆక్రమించుకున్న ఆస్తులను తన బినామీల పేర్లమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వీటిని తిరిగి బాధితులకు ఇవ్వాలంటే సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. భయంతో చేసినా.. ఇష్టపూర్వకంగా చేసినా.. ఆస్తి మరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారంటే దానిపై యాజమాన్య హక్కులు పోయినట్లే. నయీం ఆక్రమించుకున్న ఆస్తుల విషయంలోనూ ఇదే జరిగింది. బాధితులను బెదిరించి ఆస్తులు ఆక్రమించుకున్నట్లు నిరూపితం కావాలి. గతంలో ఎప్పుడో జరిగిన ఈ నేరాన్ని నిరూపించడం అంత సులభం కాదు. ఇప్పటికీ దర్యాప్తు పూర్తికాకపోవడం.. న్యాయవిచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియకపోవడం వల్ల బాధితులు ఆస్తులు ఎప్పుడు తిరిగొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వం ఏంచేయాలి..

నయీం అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ కేసులు నమోదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లలోనే దర్యాప్తు చేస్తున్నారు. న్యాయవిచారణ కూడా ఎక్కడిక్కడే జరుగుతుంది. దాంతో కేసుల విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నిందితుడు ఒక్కడే కాబట్టి అన్ని కేసులూ ఒకే దగ్గర విచారించేలా ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేస్తే కొంతయినా ప్రయోజనం ఉంటుంది. విచారణ త్వరగా పూర్తిచేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మాత్రం దానిపై దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. మూడేళ్ల నుంచి తమ ఆస్తులు తిరిగొస్తాయంటూ బాధితులు ఎదురుచూస్తునే ఉన్నారు.

ఇవీచూడండి:నయీం... వ్యవస్థ లోపాల్లోంచి పుట్టిన విషబిందువు

నయీం కేసులో సిట్​ దర్యాప్తు ముమ్మరం

నయీం కేసులో బయటకొచ్చిన రాజకీయ నేతలు, పోలీసుల పేర్లు

Last Updated : Feb 1, 2020, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details