Congress Internal Politics: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. ఎవరు.. ఎప్పుడు.. ఏం మాట్లాడతారో..? ఏలా వ్యవహరిస్తారో..? ఆ దేవుడికి కూడా తెలియదు. కొందరు నేతలు వ్యవహరించే తీరు.. రాజకీయంగా వేసే ఎత్తులు, పైఎత్తులు.. పక్కనే ఉన్న నాయకులకు కూడా అర్థం కావు. ప్రతిపక్షాలపై చేయాల్సిన రాజకీయం అంతా.. పార్టీలో అంతర్గతంగా నేతలపైనే చేస్తుంటారు. చివరి క్షణం వరకు ఏ నాయకుడిపై రాజకీయం చేస్తున్నాడో తనకు దగ్గరగా ఉండే ఆప్తమిత్రులకు సైతం తెలియకుండా జాగ్రత్త పడతారు. ఈ నేపథ్యంలో కొందరు నాయకులు ఒక్కోసారి పార్టీ కట్టుబాట్లను దాటుతుంటారు. క్రమశిక్షణ కమిటీ విచారణలు సైతం ఎదుర్కొంటారు. సరిగ్గా అలాంటి ఘటనలే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రస్తుతం హల్‌చల్ చేస్తూ.. పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరి నాయకుల ఆట రసవత్తరంగా మారింది. అసలు విషయానికొస్తే... మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌రావు, జనగాం జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి.. పీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ ఎదుర్కొంటున్నారు.
నాయకత్వంపైనే తీవ్ర విమర్శలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నా కూడా తనకు తగిన విలువ ఇవ్వకుండా తన అనుచరణ గణాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రేమ్‌సాగర్‌రావు ఇటీవల ఘాటైన విమర్శలు చేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. సొంత కుంపటి పెట్టుకుంటానని తీవ్ర హెచ్చరికలూ చేశారు. అదేవిధంగా పీసీసీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంచిర్యాలకు వెళ్లిన పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావును... ప్రేమ్‌సాగర్ రావు అనుచరులు అడ్డుకున్నారు. తనను నోటికొచ్చినట్లు దర్భాషలాడారని అందుకు బాధ్యుడైన ప్రేమ్‌సాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ ఏకంగా పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇదే అంశంపై ఆయన సోనియాగాంధీకి లేఖ రాశారు. క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోనట్లయితే మౌనదీక్ష చేస్తానని హెచ్చరికలూ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జి కార్యదర్శులు శ్రీనివాసన్, బోసురాజులతో పాటు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి రెండు రోజుల కిందట హనుమంతురావు ఇంటికి వెళ్లి దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. హనుమంతురావు వాదనలు విన్న వీరు.. అవే విషయాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌కు నివేదించారు.
క్రమశిక్షణ తరగతుల్లోనే రచ్చరచ్చ..
మరోవైపు జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి రాత్రికి రాత్రి మండల, బ్లాక్ అధ్యక్షులను మార్చారంటూ ఇటీవల జరిగిన కొంపల్లి కాంగ్రెస్ క్రమశిక్షణ తరగతుల్లోనే పెద్ద ఎత్తున రచ్చ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ప్రసంగిస్తుండగానే గొడవ చేసి రచ్చ చేశారు. దీంతో జంగా రాఘవరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. దీంతో క్రమశిక్షణ కమిటీ జంగా రాఘవరెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంది.