జన జాతర.. నాగోబా జాతర..
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ పండగ నాగోబా జాతరఫై అధికారులు శీతకన్నేశారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా నిర్వహించిన దర్భార్‌కు జిల్లా నాయకలు హాజరుకాలేదు. వచ్చిన వారు కూడా సమయం లేదంటూ ఒక్కరికే మాట్లాడే అవకాశం ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది .
కేస్లాపూర్ నాగోబా దర్శనానికి భక్తుల రాక మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలనుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. నాగోబా దర్శనానికి దాదాపుగా మూడు గంటల సమయం పడుతొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెస్రం వంశస్తులు, పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలు... ఉట్టిపడేలా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శోభారాణి, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆదిలాబాద్ పాలనాధికారి దివ్యదేవరాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాలుగు దశాబ్ధాల కిందట మానవ పరిణామా శాస్త్రవేత్త అనుచరుడిగా మైకల్ యోర్క్ ఆదిలాబాద్ ఏజెన్సీలో పనిచేశారు. లండన్‌కు చెందిన యోర్క్ దంపతులు దర్భార్‌కు రావడం అందరి దృష్టిని ఆకర్శించింది. ఆయన రచించిన పుస్తకాన్ని ఎంపీ నగేష్ విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాగోబా అభివృద్ధికి రూ. 6 కోట్లు కేటాయించినట్లుగా తనమాటగా చెప్పుమన్నారని పేర్కొన్నారు.
నాగోబా జాతరలో కీలకమైన ప్రజా దర్భార్‌కు జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమస్యలు తెలుసుకోవాల్సిన నేతలు దర్భార్‌ను విస్మరించడం పట్ల ఆదివాసీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.