తెలంగాణ

telangana

ETV Bharat / city

crop loss status: ప్రాజెక్టు నిండితే.. ఆ చేనులన్నీ చెరువులే.. రైతుల కళ్లల్లో కన్నీళ్లే..! - ప్రాజెక్టు నిండితే.. ఆ చేనులన్నీ చెరువులే.. రైతుల కళ్లల్లో కన్నీళ్లే..!

జలాశయాల మిగులు జలాలతో చెనులన్ని చెరువులవుతున్నాయి. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి.. సాగు చేసిన అన్నదాతలకు ఆవేదనే మిగులుతోంది. పంటల సాగు ఉపయోగపడాల్సిన జలాశయాల నీళ్లు.. ఇలా ముంచేస్తే ఆనందబాష్పాలు రావాల్సిన కళ్లలో కన్నీళ్లకు కారణమవుతున్నాయి. ఈ ఏడాదిలో ఏకంగా మూడు సార్లు మిగులు జలాలు పంటలను తుడిచి పెట్టి, నామ రూపాల్లేకుండా చేశాయి. ఇంత నష్టం జరిగినా.. పట్టించుకున్న నాథుడే లేడని కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అపన్న హస్తం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

crop loss with kaleshwaram back water in manchirial
crop loss with kaleshwaram back water in manchirial

By

Published : Oct 3, 2021, 10:08 PM IST

ప్రాజెక్టు నిండితే.. ఆ చేనులన్నీ చెరువులే.. రైతుల కళ్లల్లో కన్నీళ్లే..!

రాష్ట్రంలో సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని కట్టిన జలాశయం ఇప్పుడు.. కొందరు రైతుల పాలిట శాపంగా మారింది. పంటలు పండించటానికి కావాల్సిన నీళ్లు.. పొలాలను ముంచేస్తున్నాయి. కష్టపడి దున్ని, పెట్టుబడి పెట్టి, పంట సాగు చేస్తే.. తీరా చేతికొచ్చే సమయానికి నీటి పాలవుతోంది. చేనులు కాస్తా చెరువులను తలపిస్తున్నాయి. జలాశయాల బ్యాక్​ వాటర్​ వల్ల.. చాలా మంది రైతుల పంటలు నీట మునిగి మురిగిపోతున్నాయి.

మూడు సార్లు మునిగినా..

మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, కోటపల్లి, జైపూర్... కుమురం భీం జిల్లాలో బెజ్జూర్ మండలాల్లో పంటలు ఏటా నీట మునుగుతున్నాయి. మూడేళ్లుగా ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిపై నిర్మించిన జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. ఎల్లంపల్లి జలాశయం గేట్లు ఎత్తివేయడంతో సుందిళ్ల బ్యారేజీ ద్వారా గోదావరిపై ఉన్న అన్నారం బ్యారేజీకి వరద నీళ్లు చేరుతున్నాయి. ఈ మిగులు జలాల వల్ల చెన్నూరు బెజ్జూర్ మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీటమునుగుతున్నాయి. అన్నారం బ్యారేజీ బ్యాక్​వాటర్​తో గత నెలలో మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. ఈ సీజన్​లో మూడు పర్యాయాలు పంటలు నీట మునిగాయి. అప్పులు తెచ్చి మరీ.. పంటలు వేస్తే.. నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంత నష్టం జరిగినా.. ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా తమని పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన చెందుతున్నారు.

మందు తాగి సచ్చుడే దారి...

"ఈ సీజన్​లో మా పంట మునగటం మూడోసారి. మొదటిసారి పత్తివేశాను. చేతికొచ్చే సమయంలో మునిగిపోయింది. అప్పుడు ఎవరూ రాలేదు. రెండో సారి మిరప పంట వేశా. గుంటూరు నుంచి మొక్కలు కొనుక్కొచ్చాం. అప్పుడు కూడా మునిగిపోయింది. ఆ సమయంలోనూ ఎవరూ రాలేదు. ఇప్పుడు కూడా పంటను బ్యాక్​ వాటర్​ ముంచేసింది. ఇప్పటికీ ఒక్కరు దిక్కులేదు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే.. అంతా నీటిపాలైంది. ఎకరానికి సుమారు 50 వేల రూపాయాల చొప్పున పెట్టుబడి పెడితే.. మూడుసార్లకు ఒక్కొక్కరు సుమారుగా 3 నుంచి 4 లక్షలు నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ వేయాలంటే అప్పు కూడా పుట్టదు. ప్రభుత్వాధికారులు ఒక్కరు వచ్చింది లేదు. సర్వే చేసింది లేదు. స్థానిక రాజకీయ నాయకులైతే ఇటు వైపే చూసుడు లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే.. మందు తాగి సచ్చుడే తప్ప వేరే దారి లేదు." - బాధిత రైతులు.

పంటలు వేయలేని దుస్థితిలో..

మూడేళ్లుగా బెజ్జూర్, చెన్నూరు, జైపూర్, కోటపల్లి మండలాల్లో సుమారు.. 11800 ఎకరాల్లో 8 వేల మంది రైతుల పంటలు నీట మునిగాయి. ఈ ఏడాది మూడుసార్లు మిగులు జలాలు పంటలను నాశనం చేశాయి. రైతులు మూడు సార్లు మళ్లీ పంటలు వేశారు. ఇక మళ్లీ పంటలను వేయలేని దుస్ఠితిలో ఉన్నామని.. కన్నీళ్లు పెట్టుకున్నారు. పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కరకట్టను మరో కిలోమీటరు పొడవు పెంచితే చేన్లకు వరద రాదని రైతులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details