Mahaboobnagar Traffic: మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ఒకప్పుడు అధ్వాన్నంగా ఉండేవి. కిలోమీటరు ప్రయాణించేందుకు కూడా 5 నుంచి 10 నిమిషాలు పట్టేది. ఆ దుస్థితి నుంచి ప్రస్తుతం అన్ని ప్రధాన రహదారులు, కూడళ్లను విస్తరించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అయినా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడంలేదు. 8ఏళ్లలో వాహనాల సంఖ్య పెరిగి... రద్దీ అధికమైంది. కూడళ్ల సంఖ్య సైతం పెరిగింది. కానీ తగిన విధంగా ట్రాఫిక్ పోలీసు వ్యవస్థను విస్తరించలేదు. పాలమూరులో మెట్టుగడ్డ, ప్రభుత్వాసుపత్రి, న్యూటౌన్, బస్టాండ్, ఆశోక్ టాకీస్ చౌరస్తా, వన్ టౌన్, గడియారం కూడళ్లున్నాయి. ఈ ప్రాంతాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. కానీ బస్టాండ్, న్యూటౌన్, వన్ టౌన్, అశోక్ టాకీస్ చౌరస్తాల్లో మాత్రమే పోలీసులు ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో పోలీసులు లేక జనం ఇష్టానుసారం వాహనాలు నడపడం వల్ల నిత్యం ట్రాఫిక్ ఆగిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
రహదారులు విస్తరించినా ప్రధాన కూడళ్లలో ఎక్కడా పార్కింగ్ ప్రదేశాలు లేవు. ఫలితంగా రోడ్లమీదే వాహనాలు నిలుపుతున్నారు. పోలీసు నియంత్రణ లేకపోవడంతో రాంగ్ రూట్‌లలో ప్రయాణిస్తున్నారు. ఇష్టానుసారం యూటర్న్ తీసుకుంటున్నారు. 4 రహదారులు కలిసే కూడళ్లలో సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం వల్ల క్రమపద్ధతిలో కాకుండా గందరగోళంగా వాహనాలు తిప్పుతున్నారు. పద్మావతి కాలనీ కమాన్, విద్యుత్‌శాఖ కార్యాలయం, మెట్టుగడ్డ, జనరల్ ఆసుపత్రి, అబ్దుల్ ఖాదర్ దర్గా, వేపూరి గేరికి వెళ్లే కల్వర్టు, పాన్ చౌరస్తా, గడియారం కూడలి వద్ద ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారుతోంది.