తెలంగాణ

telangana

ప్రజా రవాణాకు దూరం.. కరోనా వల్ల పెరిగిన వాహన విక్రయాలు

By

Published : Aug 25, 2020, 11:29 AM IST

ద్విచక్ర వాహనాల కొనుగోలు బాగా పెరిగింది. బీఎస్‌- 6 వాహనాలు ఆయా షోరూంలలో వినియోగదారులకు సరిపడా అందుబాటులో ఉండటం లేదు. వచ్చిన వాహనాలు వచ్చినట్లే అయిపోతున్నాయని షోరూంల యజమానులు చెబుతున్నారు. కొన్ని కంపెనీల మోడళ్ల సరఫరా సక్రమంగా ఉండటం లేదని.. అవి కూడా సకాలంలో వస్తే ఈ వ్యాపారం ఇంకా ఎక్కువగా సాగేదని తెలిపారు.

trading of vehicles increased after lockdown in mahabubnagar
ప్రజా రవాణాకు దూరం.. కరోనా వల్ల పెరిగిన వాహన విక్రయాలు

కరోనా మహమ్మారి దెబ్బకు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న జనం.. తప్పనిసరైతే సొంత వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు.. బస్సులు.. ఆటోలు వినియోగించుకుంటే కొవిడ్‌ -19 వ్యాపించే అవకాశముందని సొంతవాటిపై ప్రయాణానికే ఆసక్తి చూపుతున్నారు.. ఈ క్రమంలో కొత్తగా వాహనాల కొనుగోలు పెరిగింది.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహనాల విక్రయం జోరుగా సాగుతోంది..

కరోనా వ్యాప్తితో మార్చి 22వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను ప్రవేశపెట్టడంతో వాహన కంపెనీల షోరూంలు తెరచుకోలేదు. మే 16 నుంచి విక్రయాలకు అవకాశమివ్వగా వాహన విక్రయ వ్యాపారం గతంకంటే పెరిగింది. ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేయడంపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఓ వైపు కరోనా నేపథ్యంలో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నా.. వాహనాల కొనుగోలు మాత్రం ఆగలేదు. లాక్‌డౌన్‌ సమయంలోనూ గతంలో కొన్నవాటికి రిజిస్ట్రేషన్లు చేశారు. దీంతో ఏప్రిల్‌ నుంచి జులై వరకు రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.26.01 కోట్ల ఆదాయం వచ్చింది.

లాక్‌డౌన్‌కు ముందు తరవాత వాహన విక్రయాల తీరు..

రూ.158.12 కోట్ల వ్యాపారం : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్లు, ద్విచక్ర వాహనాలు అమ్మకాలు రూ.158.12 కోట్ల వరకు జరిగిందని ఆయా కంపెనీల మార్కెటింగ్‌ నిపుణులు చెబుతున్నారు. నాలుగు నెలల నుంచి మొత్తం 22,900 వాహనాలను విక్రయించారు. అందులో 22,200 ద్విచక్ర వాహనాలే. వాటి ద్వారానే రూ.96.52 కోట్ల వ్యాపారం జరిగింది. వాటితోపాటు కార్లు 770 విక్రయించారు. వాటి ద్వారా రూ.61.60 కోట్ల వ్యాపారం చేశారు.

  • కరోనాతో ఆదాయం తగ్గిన నేపథ్యంలో పాత వాహనాలను విక్రయించాలనుకున్నవారు కూడా మరమ్మతు చేయించుకొని వినియోగించుకోవడం పెరిగిందని మెకానిక్‌లు చెబుతున్నారు.
  • సెకండ్‌ సేల్‌ కార్ల వ్యాపారం మాత్రం గతంతో పోలిస్తే తగ్గడం గమనార్హం. కొనుగోలు చేయాలనుకునేవారు కొత్తవే కొంటున్నారని.. పాతవి కొంటే మరమ్మతుల భయం ఉండి ఉండవచ్చని ఓ పాత కార్ల విక్రేత చెప్పారు. కరోనాకు ముందు నెలకు 40 వాహనాలను విక్రయించే తాను ఇప్పుడు నెలకు 12 వాహనాలను మాత్రమే విక్రయించగలుగుతున్నానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details