పాలమూరు జిల్లా పేరు చెబితే అందరికి గుర్తుకు వచ్చేది పిల్లలమర్రి. శిధిలావస్థకు చేరిన వృక్షానికి పునరుజ్జీవం కల్పించేందుకు అటవీశాఖ చేసిన అనేక ప్రయోగాల ఫలితంగా పిల్లలమర్రి కొత్త చిగుర్లు, ఊడలతో కళకళలాడుతోంది. అదే మహబూబ్ నగర్ జిల్లాలో పిల్లలమర్రికి ఏ మాత్రం తీసుపోని మరో మహావృక్షం మాత్రం నిరాదరణకు గురై ఆనవాళ్లు కోల్పొతోంది. నవాబుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో పిల్లలమర్రి తరహాలో ఉన్న వృక్షం పాలమూరులో ఉన్న దానికంటే పెద్దదని చెబుతున్నారు. ఐదెకరాల విస్తీర్ణంలో విస్తరించిన చెట్టు వందేళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. చెట్టు మధ్యలో ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయ ఎదురుగా ఉన్న మర్రి వృక్షాన్నే చెట్టు మొదలుగా భావిస్తున్నారు. మొదళ్లు శిథిలావస్థకు చేరి కూలిపోతుండగా.. మరోవైపు నుంచి వస్తున్న కొత్త ఊడలతో చెట్టు మరింత విస్తరిస్తోంది.
పిల్లల మర్రి లాగే కొత్తపల్లి మర్రివృక్షాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అవసాన దశకు చేరిన మర్రికి పునరుజ్జీవం కలిగిస్తే అరుదైన వృక్షాన్ని కాపాడిన వాళ్లమవుతామని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వృక్షం సర్వే నంబర్ 54లో ఓ వ్యక్తి పట్టాభూమిలో విస్తరించి ఉంది. ప్రభుత్వానికి భూమి అప్పగించేందుకు పట్టాదారు సైతం సుముఖంగా ఉన్నారు. అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ సైతం విజ్ఞాపన పత్రం అందించారు. అటవీ శాఖ, పర్యాటక శాఖలు స్పందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరున్నారు.