మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం క్రిస్టియన్‌పల్లిలోని సర్వే నెంబర్ 523లో ఇంటి నిర్మాణాలు జోరందుకున్నాయి. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్లను నిర్మిస్తున్నారని నాడు అధికారులు కూల్చివేసిన చోటే... ప్రస్తుతం నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పట్టా లేకుండా ఇల్లేలా నిర్మిస్తున్నారని ఓ మహిళను ఈనాడు-ఈటీవీ భారత్ బృందం ప్రశ్నించగా.... 3రోజుల కిందటే తనకు పట్టా ఇచ్చారని అంతకుముందు పట్టా లేనందువల్లే ఇల్లు కూల్చారని చెప్పారు. 523సర్వే నంబర్‌లో గత కొన్నేళ్లుగా 2వేల500 మందికి పట్టాలిచ్చినట్లు గుర్తించారు. అందులో అర్హులకు చెందినవి కేవలం 586 ఉన్నట్లు 2017లో అధికారులు తేల్చారు. ఆ తర్వాత కొత్తగా పట్టాలివ్వకూడదని నిర్ణయించారు. కాని 3రోజుల క్రితం ఆ మహిళకు పట్టా ఎలా ఇచ్చారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
2008లోనే మంజూరైనట్లు పట్టా...
అదే సర్వే నంబర్‌లో 75గజాల స్థలానికి పట్టా ఇస్తానని చెప్పి ఇటీవలే ఓ పార్టీ నేత నలుగురి వద్ద 4 లక్షలు తీసుకున్నారు. 2008లో మంజూరైనట్లుగా వారి చేతికి పట్టా ఇచ్చారు. ఆ భూమి కోసం వెళ్తే... అది తమ స్థలమంటూ ఇంకొకరు గొడవకు దిగారు. ఇలా పలువురి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. మహబూబ్‌నగర్ నూతన కలెక్టరేట్ కు సమీపంలో, బైపాస్ రహదారికి కొద్దిపాటి దూరంలో ఉన్న భూములు కావడం... పక్కనే తాజాగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లుండడంతో... ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆ భూముల్ని దక్కించుకునేందుకు అక్రమాలకు తెరలేచింది. ఇప్పటికే పట్టాల పేరిట కోట్ల రూపాయలు చేతులు మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు పడకల ఇళ్ల కోసం ఎంపికైన లబ్ధిదారుల జాబితాలోనూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.