జోగులాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. గద్వాల పట్టణం శివారులో ఉన్న వజ్రాలగుట్ట నుంచి రాత్రికి రాత్రి ప్రొక్లైనర్లతో గుట్టను తవ్వడం, తెల్లవారే సరికి ఎర్రమట్టిని లక్షిత ప్రదేశాలకు తరలించడం కొద్దినెలలుగా యధేచ్ఛగా కొనసాగుతోంది. ఇటీవల గద్వాల పట్టణంలో స్థిరాస్థి వ్యాపారం జోరందుకుంది. ఖాళీ స్థలాలను చదును చేసేందుకు మట్టికి డిమాండ్ ఏర్పడింది. దీంతోపాటు రోడ్లు, భవనాలు సహా పలురకాల నిర్మాణ పనుల కోసం మట్టి అవసరాలు పెరిగాయి.
దాదాపుగా కనుమరుగు..
ఈ అవసరాలను జిల్లాలోని కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ మట్టి రూ.4,500 నుంచి రూ.5వేల వరకూ పలుకుతోంది. ట్రాక్టర్ మట్టి రూ.500 నుంచి వెయ్యిరూపాయలు పలుకుతోంది. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసేందుకు కొందరు వజ్రాల గుట్టపై కన్నేశారు. ఎక్కడికక్కడ గుట్టను తవ్వేశారు. పదేళ్ల కిందట కనబడిన గుట్ట దాదాపుగా కనుమరుగైంది. కళ్లెదుటే గుట్టలుగా మట్టి తరలిపోతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. ప్రశ్నించిన వాళ్లూ లేరు. దీంతో అక్రమార్కులు ఆడిందే ఆటగా తయారైంది. వజ్రాల గుట్టలో అక్రమ మట్టి రవాణా కొంతమందికి కోట్లు సంపాదించి పెట్టినట్లుగా తెలుస్తోంది.