మహబూబ్‌నగర్‌లోని సంజయ్‌నగర్ కాలనీ పరిసరాల్లో చాలా ఏళ్లుగా నాలుగైదు బియ్యపు మిల్లులు నడుస్తున్నాయి. ఆ మిల్లులకు పక్కనే అనేక జనావాసాలున్నాయి. ఐతే ధాన్యపు పొట్టు బైటకు రాకుండా, గాలిలో దుమ్మూధూళి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఊక నిల్వ చేసేందుకు మూసిఉండే షెడ్లు ఏర్పాటుచేయాలి. ప్రహరీచుట్టూ 10 మీటర్ల వెడల్పుతో గ్రీన్ బెల్డ్ అభివృద్ధి చేస్తూ చెట్లుపెంచాలి. వ్యర్థ జలాలను బహిరంగ ప్రదేశాల్లోకి, కాల్వల్లోకి వదలకూడదు. బాయిలర్ నుంచి వచ్చె బూడిదను నిల్వ చేయడానికి మూసిఉండే షెడ్లు ఏర్పాటు చేసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఆ మిల్లుల యజమానులు కనీస నిబంధనలు పాటించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఊకతో కప్పేస్తున్న మిల్లులు... ఊడ్వలేక జనాల అవస్థలు
అక్కడ బియ్యపు మిల్లులు నడిచేటప్పుడు అరగంట నిలబడితే చాలు... శరీరంపై సన్నని పొరలా దుమ్మూధూళి పేరుకుపోతుంది. ఆ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణాల ఉపరితలాలు, చెట్లు, పాత్రల్లోని నీళ్లు, ఏ వస్తువు గమనించినా దుమ్ము పేరుకుపోయి కనిపిస్తుంది. తెల్లవారుజామున ఇళ్లు ఊడిస్తే.. దోసెడంత ఊకకుప్పగా చేతికి వస్తుంది. సమస్య పరిష్కరించాలని అధికారులకు తమ గోడును వెళ్లబోసుకుంటున్నా పట్టించుకున్న వారేలేరని మహబూబ్‌నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం 10 నుంచి రాత్రి వరకు మిల్లులు నడిచినంత సమయం ఊక, దుమ్మూధూళి బైటకు వచ్చి పరిసరాలను కమ్మేస్తోందని.... సాయంత్రం వేళల్లో తీవ్రత అధికంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంటి నిండా దుమ్ము పేరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగేనీళ్లు, తినే ఆహారంపైనా పడి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారి తరచూ రోగాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన చెంబుతున్నారు.
స్థానికుల ఫిర్యాదుతో ఎట్టకేలకు కాలుష్య నియంత్రణా మండలి అధికారులు స్పందించారు. ఇటీవలే వాటిలో తనిఖీలు చేయగా వాటికి అసలు పీసీబీ అనుమతులే లేవని తేలింది. ఆ మిల్లులకు షోకాజ్ నోటీసులు జారీచేసిన అధికారులు... 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరింది. నిర్ణీత గడువు లోపు స్పందించకపోతే తదుపరి ఎలాంటి నోటీసులు లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు వేగంగా చర్యలు తీసుకుని తమకు ధూమశాపం నుంచి విముక్తి కల్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.