నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలను కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం, జోగులాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. మహబూబ్‌నగర్ హరిత హోటల్లో జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులతో తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
పుష్కరాల కోసం ఐదు చోట్ల ఘాట్లు ఇప్పటికే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. భక్తులు కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులు, శానిటైజర్లు తప్పకుండా వాడాలన్నారు. శరీర ఉష్ణోగ్రతను కొలిచే యంత్రాలతో పాటు రాపిడ్ యాంటీజెన్ పరీక్షలకోసం శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులంతా కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఈ ఏడాది తుంగభద్ర పుష్కరాలు సంప్రదాయబద్ధంగా నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.