భీమా ఎత్తిపోతల పథకం రెండో దశలో భాగంగా వనపర్తి జిల్లాలో శ్రీరంగాపూర్ వద్ద రంగసముద్రం, కానాయపల్లి వద్ద శంకరసముద్రం జలాశయాలను నిర్మించారు. రంగసముద్రం కింద నాగరాల గ్రామం ముంపునకు గురి కాగా.. వారికి మూడు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికీ నిర్వాసితులకు అందాల్సిన పునరావాస ప్యాకేజీ పూర్తిగా అందలేదు. దీంతో ముంపు గ్రామాన్ని వీడి పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు నిర్వాసిత కుటుంబాలు నిరాకరిస్తున్నాయి. వర్షాకాలం వస్తే జలాశయం పూర్తిగా నిండి ఇళ్లలోకి నీరు చేరుతోంది. అయినా సగానికి పైగా గ్రామస్థులు అక్కడే జీవనం గడపుతున్నారు.
నెలలు గడిచినా..
నాగరాల గ్రామంలో 986 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నారు. వారి కోసం పునరావాస కేంద్రాలు సైతం సిద్ధంగా ఉన్నాయి. కాని చెల్లించాల్సిన పరిహారం రాకపోవడంతో వాళ్లు సమేమిరా అంటున్నారు. భూసేకరణ జరిపి ఏళ్లు గడుస్తోంది. అప్పుడిచ్చిన పరిహారం ఇప్పుడు దేనికీ సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో పునరావాసం కోసం కొత్త డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతున్న నిర్వాసితులు..18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంలో పాటు ప్యాకేజీ వర్తింప జేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్వయంగా మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు హామీ ఇచ్చి నెలలు గడిచినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని వాపోతున్నారు. పునరావాస కేంద్రాల వద్ద వసతులు కల్పించడం తోపాటు 2 పునరావాస కేంద్రాల మధ్య రూ.9కోట్ల అంచనాతో నిర్మించాల్సిన వంతెనను సైతం వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.