తెలంగాణ

telangana

ETV Bharat / city

మొక్కలకు క్యూఆర్​ కోడ్​... స్కాన్‌ చేస్తే అరచేతిలోనే సమాచారం - mahabbobnagar latest news

బొటానికల్ గార్డెన్లలో ఉండే అరుదైన మొక్కల గురించి తెలుసుకోవాలంటే ఆ సమాచారాన్ని తెలిపే బోర్డులైనా పక్కనుండాలి. లేదంటే ఆ మొక్కల గురించి తెలిసిన వాళ్లు పక్కనుండి ఒక్కో మొక్క గురించి వివరించి చెప్పాలి. ఇది చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్నపని. అలాంటివేవి లేకుండా సందర్శకులే స్వయంగా ఆ మొక్కల సమాచారాన్ని తెలుసుకునే క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు. తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో ప్రతి మొక్కకు క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

QR code for trees in mahabbobnagar botanical garden
QR code for trees in mahabbobnagar botanical garden

By

Published : Feb 19, 2021, 4:25 AM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు స్మారక డిగ్రీ కళాశాలలో ఐదెకరాల విస్తీర్ణంలో తెలంగాణ బొటానికల్ గార్డెన్ రూపుదిద్దుకుంటోంది. దేశ, విదేశాలకు చెందిన అరుదైన మొక్కల్ని సేకరించి ఒకేచోట వృక్షశాస్త్ర విద్యార్ధులకు అందుబాటులో ఉంచాలన్నది ఈ బొటానికల్ గార్డెన్ ప్రధాన ఉద్దేశం. వెయ్యి రకాలకు చెందిన ఆరు వేల మొక్కల్ని గార్డెన్‌లో పెంచాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ గార్డెన్ లో 450రకాల మొక్కలున్నాయి.

ఉద్యానవనంలోమొక్కల్ని చూడటానికి నిత్యం సందర్శకులు, విద్యార్ధులు వస్తూ ఉంటారు. వచ్చినవారందరికీ మొక్కల గురించి వివరించడం సిబ్బందికి కష్టంగా మారింది. అలాంటి ఇబ్బందులకు పరిష్కారంగా ప్రతీ మొక్కకు "క్విక్ రెస్పాన్స్ కోడ్ " ను ఏర్పాటు చేయాలని వృక్షశాస్త్ర విభాగం నిర్ణయించింది. ఈ మేరకు 30రకాల మొక్కలకు క్యూ-ఆర్ కోడ్ రూపొందించి ట్యాగ్ చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్‌ చేస్తే ఆ మొక్కకు సంబంధించిన సమాచారం మొబైల్‌లో ప్రత్యక్షమవుతుంది.

క్యూఆర్​ కోడ్ క్రియేటర్‌లో మొక్కకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. వృక్ష శాస్త్ర విద్యార్దుల, పరిశోధకులకు ఇది ఉపయుక్తంగా మారింది. మొక్కను ప్రత్యక్షంగా చూస్తూ విద్యార్ధులు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. యువత నగదు రహిత లావాదేవీల్లో కోడ్ స్కాన్ చేయడం వారికి అలవాటైంది. అలాగే అలాంటి కోడ్‌ల ద్వారా మొక్కల సమాచారం తెలుసుకోవడం వినూత్న ప్రయోగమని, విద్యార్ధులకు సులువుగా అర్థమయ్యే విధానమని అధ్యాపకులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ క్యూ-ఆర్ కోడ్ లను గార్డెన్ నిర్మాణం పూర్తయ్యాక అన్ని మొక్కలకూ వర్తింప జేస్తామని అధ్యాపకులు వివరిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను చదువుకు అనుసంధానం చేయడం ద్వారా విద్యార్ధులు సులువుగా విద్యను నేర్చుకోవాలన్నది ఈ ప్రయోగంలో మరో ఉద్దేశం. కోడ్ ద్వారా ప్రస్తుతం ఆంగ్లంలో మాత్రమే సమాచారం వస్తోంది. మున్ముందు ఆ సమాచారాన్ని ఆడియోరూపంలో చదివి వినిపించేలా ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ భౌగోళిక స్వరూపంలో బొటానికల్ గార్డెన్ రూపుదిద్దుకుంటోంది. త్వరలోనే పూర్తిస్థాయి హంగులతో సందర్శకులకు అందుబాటులోకి రానుంది.

ఇదీ చూడండి: 'మేవరిక్‌ మెస్సయ్య' పుస్తకం ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details