తెలంగాణ

telangana

ETV Bharat / city

వాళ్లకో న్యాయం.. మాకో న్యాయమా..? - TG_MBNR_10_15_NIRVASITHULA_GODU_PKG_C8

ఇచ్చే పరిహారమే అంతంత... ఇచ్చింది కూడా అరకొరే. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఒక న్యాయం...  మాకో న్యాయమా అంటూ..... వట్టెం వెంకటాద్రి జలాశయ నిర్వాసితులు ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబానికి రెండు పడక గదుల ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, 18 ఏళ్లు నిండిన వారికి పునరావాస ప్యాకేజీ ఇచ్చే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు.  ప్రభుత్వం స్పందించకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.

వెంకటాద్రి జలాశయ భూ నిర్వాసితుల ఆందోళన

By

Published : May 16, 2019, 1:02 PM IST

Updated : May 17, 2019, 5:27 PM IST

వెంకటాద్రి జలాశయ భూ నిర్వాసితుల ఆందోళన

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వద్ద ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన వెంకటాద్రి జలాశయ భూ నిర్వాసితుల ఆందోళనల రోజురోజుకూ ఉధృతమవుతోంది. వారం రోజుల పాటు కొనసాగుతున్న నిరసనలు ప్రస్తుతం నిరాహార దీక్షల వరకూ చేరాయి. మల్లన్న సాగర్ నిర్వాసితులకు చెల్లించినట్లే తమకూ పరిహారం చెల్లించాలని, భూసేకరణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడు రోజుల కిందట జలాశయం పనులు చేస్తున్న నిర్మాణ కంపెనీల ముందు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఐనా అధికార యంత్రాంగం స్పందించనందున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం తప్ప తామేమీ చేయలేమని అధికారులు స్పష్టం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ నిన్నటి నుంచి నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ ఆందోళన ఆగదని నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు.
459 ఇళ్లు ఖాళీ చేయాలి..
జలాశయ నిర్మాణం కోసం 1300 ఎకరాల భూములు సేకరించాల్సి ఉండగా, 1100 ఎకరాల భూములు సేకరించారు. ఇంకా 200 ఎకరాలు సేకరించాల్సి ఉంది. సేకరించిన భూమికి 123 జీఓ ప్రకారం భూముల స్వభావాన్ని బట్టి మూడున్నర లక్షల నుంచి ఐదున్నర లక్షల వరకూ పరిహారం చెల్లించాలి. జలాశయంలో ఆన్ఖాన్ పల్లి, అన్ఖాన్ పల్లి తండా, కారుకొండ, జీ గుట్ట తండా, రాంరెడ్డిపల్లి తండా గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇక్కడ 459 ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంది. వీరందరికీ పునరావాసం కల్పించాలి.
ఎందుకు పనికిరాకుండా పోతుంది
చెల్లించాల్సిన పరిహారాన్ని విడతల వారీగా చెల్లించడం, ఇప్పటికీ సగం భూములకే చెల్లించడం పట్ల నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం చెల్లించిన పరిహారం తమకు ఎందుకూ పనికిరాకుండా పోయిందని, ఆ డబ్బులతో మరోచోట భూములు కొందామంటే ఎకరా రూ. 20లక్షలు ధర ఉందంటున్నారు. తెలంగాణలోనే అంతర్భాగమైన మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు రూ. 10 లక్షలు, రూ. 15లక్షలిచ్చి.. వట్టెం భూనిర్వాసితులకు మాత్రం మూడున్నర, ఐదున్నర లక్షలిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
పొమ్మన లేక పొగబెట్టారు...
వట్టె జలాశయం కోసం భూసేకరణ చేసినప్పుడు... నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీతో పాటు.. రెండు పడక గదలు ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే పనులు కొనసాగించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొమ్మన లేక పొగబెట్టినట్లు.... ప్రస్తుతం జరుగుతున్న పనుల కారణంగా వచ్చే దుమ్ము, ధూళి వల్ల గ్రామాల్లో నివసించలేని దుస్థితి నెలకొందని వాపోయారు. చనిపోయిన వ్యక్తిని ఖననం చేద్దామన్న ఎక్కడ, ఎప్పడు తవ్వకాలు జరుపుతారోనని భయపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ప్రగతి భవన్​ను, శాసనసభను ముట్టడిస్తామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు.

Last Updated : May 17, 2019, 5:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details