ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యాటక ప్రాంతాలుగా పిల్లలమర్రి, జూరాల ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శతాబ్దాల క్రితం కాకతీయులు నిర్మించిన చంద్రగఢ్ కోటకు సరైన గుర్తింపు లేక.. మరుగున పడిపోయింది. ప్రభుత్వం స్థానికంగా ఉండే పర్యాటక ప్రాంతాలకు సజీవరూపం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఈ కోట ప్రాధాన్యం సంతరించుకుంది. అనేక విశిష్టతలకు నెలవైన చంద్రగఢ్ కోటను 18వ శతాబ్దిలో చంద్రగిరి మహారాజు చంద్రసేనుడు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి.
ఇవిగో ప్రత్యేకతలు..
శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు శత్రుదుర్భేద్యమైన కోట గోడలు నిర్మించారు. ప్రహరీ గోడలు చాలా ఎత్తుగా ఉండటంతో శత్రువులు లోనికి వచ్చే అవకాశమే లేదు. కోట ప్రధాన ద్వారం నేటికీ చెక్కు చెదరలేదు. ఇరువైపులా అరుగులు, ఎత్తయిన తలుపులు కోటపై భాగంలో అక్కడక్కడ ఫిరంగుల కోసం పైన గదులు నిర్మించారు. ప్రత్యర్థులు దాడికి వస్తే ప్రత్యేక దర్పణాలతో పసిగట్టి ఫిరంగుల ద్వారా మట్టికరిపించేలా నిర్మాణాలున్నాయి. ఈ కోటకు రెండు ముఖద్వారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒకటి మూసి వేయగా.. పశ్చిమ ద్వారం నుంచి లోపలికి ప్రవేశం ఉంది. కోట లోపల నీటి ఎద్దడి తలెత్తకుండా 12 చెలిమెలు తవ్వించారు. రాయిపై నిర్మించిన చెలిమెలో నిత్యం నీళ్లు ఉండడం ఇక్కడి ప్రత్యేకత.