Parking problems: మహబూబ్‌నగర్ పట్టణంలో వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటు ప్రక్రియ ప్రహసనంగా మారింది. 18 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నా.... అవి ఎక్కడా వినియోగంలో లేవు. కేవలం బోర్డులు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. పార్కింగ్ స్థలాలను వాహనాలు నిలిపేందుకు అనువుగా అభివృద్ధి చేయాల్సి ఉండగా..... ఆ పని ఎక్కడా జరగలేదు. కలెక్టరేట్ వద్ద పార్కింగ్ స్థలంలో రక్షణ లేకపోవడంతో... ఎవరూ వాహనాలను నిలపడం లేదు. తితిదే కళ్యాణ మండపం, మత్సశాఖ కార్యాలయం, డైట్ కళాశాల, గడియారం కూడలి వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్థలాలు పార్కింగ్‌కు అనుకూలంగా లేవు. ఎత్తుపల్లాలతో, రాళ్లు రప్పలతోపాటు... పలుచోట్ల వీధి వ్యాపారులు ఆక్రమించడంతో పార్కింగ్‌కు ఇబ్బందిగా మారింది. ఇలా పార్కింగ్ బోర్డులు ఉన్న చోట స్థలాలు అనువుగా లేక స్థలాలు బాగున్న చోట వీధి వ్యాపారులు పాగా వేయడంతో... ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక జనం రోడ్డుమీదే వాహనాలు నిలుపుతున్నారు.
మహబూబ్‌నగర్‌లో వాహనదారులకు తప్పని పార్కింగ్ తిప్పలు - mahabubnagar latest news
Parking problems పార్కింగ్ బోర్డులుంటాయి కానీ వాహనాలు నిలిపేందుకు అనువైన స్థలం ఉండదు. ఆ ప్రాంతాల్లో ఎత్తుపల్లాలు, రాళ్లు రప్పలు, వీధివ్యాపారుల దుకాణాలుంటాయి. దీంతో పార్కింగ్ స్థలం లేక ప్రజలు రోడ్లపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. నో పార్కింగ్ ప్రాంతంలో వాహనాలు ఆపినందుకు అపరాధ రుసుములు వసూలు చేస్తున్న పోలీసులు పార్కింగ్ స్థలాల వినియోగంపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా మహబూబ్‌నగర్‌లో పార్కింగ్ కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఓ వైపు వాహనాలకు భద్రత కరవై మరోవైపు పోలీసు చాలాన్లు భారమై జనం ఇబ్బందులు పడుతున్నారు.
మహబూబ్‌నగర్‌లో రోడ్ల విస్తరణ జరిగినా.... షాపింగ్‌కు వచ్చిన ప్రజలు వాహనాలు నిలిపేందుకు దుకాణ యజమానులు, మున్సిపాలిటీ అధికారులు ఎక్కడా స్థలాలు చూపించలేదు. దీంతో పట్టణవాసులు రోడ్లపక్కనే వాహనాలు నిలిపేస్తున్నారు. పార్కింగ్ లేని చోట నిలిపినందుకు పోలీసులు.... ఈ చలాన్ ద్వారా అపరాధ రుసుములు విధిస్తున్నారు. ఇది జనానికి భారంగా మారింది. పార్కింగ్ చూపించకుండా ఫైన్‌లు వసూలు చేయడంపై మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ వ్యాజ్యం దాఖలు చేయగా.. 18 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు కోర్టుకు విన్నవించారు. ఎక్కడా అవి వినియోగించేందుకు వీలులేకుండా ఉన్నాయని జనం అంటున్నారు.
మరోవైపు పార్కింగ్ స్థలాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. నిధుల కొరత ఉందని, మున్సిపాలిటీకి అదనపు నిధులు రాగానే అభివృద్ధి చేస్తామని మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పాత బస్టాండ్ వద్ద పెయిడ్ పార్కింగ్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. 18 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినా.... అవి ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో జనానికి తెలియడంలేదు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.