జనాలు అధికంగా గుమికూడిన చోట.. వైరస్ వ్యాప్తి ఎక్కువని తెలిసినా... కొందరు మాస్కు మాత్రం ధరించటం లేదు. ముఖానికి మాస్క్ ఉన్నా.. వాటిని ముక్కుకు తగిలించుకున్నవాళ్లు చాలా తక్కువ. చెవుల్లో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటల్ని ఆస్వాదించడంపై ఉన్న శ్రద్ధ.. మాస్కు ధరించడంపై కనిపించడం లేదు. బస్సుల్లోనూ... జనం మాస్కులు పూర్తిగా ధరించడం లేదు. మాస్కులేని వారిని బస్సు ఎక్కనిచ్చేది లేదని ఆర్టీసీ సిబ్బంది నెత్తినోరు మొత్తుకుంటున్నా.. అప్పటి వరకూ ముఖానికి ఏదో వస్త్రం తగిలించుకుని బస్సెక్కుతున్నారు. ప్రయాణించేటప్పుడు తొలగిస్తున్నారు. ఈ అజాగ్రత్తే జనం కొంపముంచుతోంది. ఇదీ మహబూబ్నగర్లో ప్రస్తుత దుస్థితి.
భౌతికదూరం పాటించడం సంగతి సరేసరి. ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడం ఆర్టీసికి తప్పని విధి. విధినిర్వహణలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో బస్సులో నిండుగా ప్రయాణీకులున్న వారిని తీసుకువెళ్తున్నారు. ఐతే మాస్కు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం ద్వారా... వైరస్ వ్యాప్తిని కొంత మేరకు నివారించవచ్చు. కాని ఆ జాగ్రత్తల్ని కుడా జనం పాటించడం లేదు. గతంలో ఆర్టీసీ అధికారులే... సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ చేశారు. కండక్టర్లు వినియోగించడంతోపాటు.. ప్రయాణీకులను చేతులకు రాసే వాళ్లు. కాని ఇప్పుడు ఆర్టీసీ అధికారులు శానిటైజర్లు పంపిణీ చేయకపోవడంతో... సిబ్బంది మాత్రమే వాటిని వాడుతున్నారు.