మహబూబ్నగర్ జిల్లాలో మరోసారి ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని.. అమాయక రైతులపై దాడులు చేస్తూ అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని నేను సైతం అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. అడ్డొచ్చిన గ్రామస్థులు, పట్టాభూములున్న రైతులను హత్యలు చేసి ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
'ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతోనే ఇసుకమాఫియా'
మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగి పోతున్నాయని 'నేను సైతం' అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. ఇసుక మాఫియాకు మద్దతిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతోనే అమాయక రైతులపై దాడులు చేస్తున్నారని ఆక్షేపించింది.
తాజాగా జిల్లాలో చోటు చేసుకున్న రాజాపూర్ మండలం తిరుమలపూర్ గ్రామ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా పేట్రేగిపోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులే కారణమని ఆరోపించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల అండదండలతో అమాయకమైన రైతులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు.