తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్లాస్టిక్​పై పర్యవేక్షణ లోపం.. విచ్చలవిడిగా వినియోగం - యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం

ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి, ఆరోగ్యానికి హానికరం. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరం. 50 మైక్లాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని ప్రభుత్వం నిషేధించినా... అమల్లో మాత్రం కనిపించటం లేదు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేసినా... ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్లాస్టిక్‌ వాడకం తగ్గటం లేదు. నిఘా లేకపోవడం... అంతంత మాత్రం జరిమానాలు విధించటంతో యథేచ్ఛగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు.

Monitoring error on plastic .. Stray usage in mahabubnagar district
ప్లాస్టిక్​పై పర్యవేక్షణ లోపం.. విచ్చలవిడిగా వినియోగం

By

Published : Feb 27, 2021, 10:19 AM IST

Updated : Feb 27, 2021, 5:23 PM IST

ప్లాస్టిక్​పై పర్యవేక్షణ లోపం.. విచ్చలవిడిగా వినియోగం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లాక్‌డౌన్‌కు ముందు నిఘా, అవగాహన కార్యక్రమాలతో ప్లాస్టిక్ వినియోగం తగ్గినా... ప్రస్తుతం పెరుగుతోంది. దీంతో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తోంది. అధికారులు దాడులు చేస్తారన్న భయంతో పెద్ద వ్యాపారులు, షాపింగ్ మాళ్లు, హోల్‌సేల్ దుకాణాల్లో ప్లాస్టిక్ సంచుల్నివాడటం లేదు. కానీ వీధి వ్యాపారులు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం వ్యాపారులు మాత్రం వినియోగిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలున్న ప్లాస్టిక్ సంచుల్ని వాడాలంటే అధిక ఖర్చవుతుంది. అధికారులు చర్యలు తీసుకుని ప్లాస్టిక్‌ను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.


బాధ్యత స్థానిక సంస్థలదే..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 19 పురపాలికల్లో నిత్యం 300 మెట్రిక్ టన్నులకు పైగా తడి, పొడి చెత్త ఉత్పత్తి అవుతోంది. దీనిలో 20 నుంచి 50శాతం వరకూ ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసి పునర్వినియోగం లేదా నిర్వీర్యం చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలదే. కానీ ఉమ్మడి జిల్లాలోని సగానికి పైగా మున్సిపాలిటీల్లో వాటిని వేరుచేసే వ్యవస్థే అమల్లో లేదు. బహిరంగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చకూడదనే నిబంధనలున్నా పట్టించుకోవటం లేదు. అధికారులు మాత్రం ప్లాస్టిక్‌ను నియంత్రించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు..


దాడులు చేసి రెండేళ్లపైనే..

నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేదుకు అధికారులు దాడులు నిర్వహించి... నిబంధనలు ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుములు విధించాలి. పెబ్బేరు, అలంపూర్, కొత్తకోట లాంటి పురపాలికల్లో రెండేళ్లుగా అసలు దాడులే చేయలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్లాస్టిక్‌ను సేకరిస్తే అందుకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నట్లు నాగర్‌కర్నూల్‌ పురపాలిక అధికారులు వెల్లడించారు.


నిబంధనలు ఉల్లంఘించే వారికి..

మహబూబ్‌నగర్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు బృందాలు ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న వ్యాపారస్తులే నిషేధిత ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వాడుతున్నట్లు గుర్తించామన్నారు. వారికి భారీగా జరిమానాలు విధిస్తూ అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ సంచులకు బదులు నూలు, జనపనార, కాగితపు సంచుల్ని వినియోగించేలా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి. నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించాలని ప్రజలు కోరుతున్నారు.


ఇవీ చూడండి:30రోజుల్లో రాష్ట్రంలో రూ.5 పెరిగిన పెట్రోల్ ధర

Last Updated : Feb 27, 2021, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details