Mahabubnagar Pedda Cheruvu: మహబూబ్‌నగర్‌లో పెద్దచెరువు రూపురేఖలు క్రమంగా మారిపోతున్నాయి. సుందరీకరణ పనులు ముమ్మరంగాసాగుతున్నాయి. ఒకప్పుడు ఈ చెరువు కట్ట తుమ్మచెట్లు, ముళ్ల పొదలతో.. జనం సంచరించేందుకు వీలులేకుండా ఉండేది. పాలమూరు పట్టణం నుంచి వచ్చే మురుగునీటితో నిండి దుర్గంధం వెదజల్లేది. ప్రస్తుతం ఈ చెరువును మిని ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేశారు. దీన్ని ఆనుకునే హైదరాబాద్ తరహాలో శిల్పారామం నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ వరకు సమయం ఉన్నా అంతకన్నా ముందే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
పట్టణం నుంచి వచ్చే మురుగుతో నిండిన చెరువుని ప్రస్తుతం ఖాళీ చేశారు. మురుగు నీరు చెరువులోకి రాకుండా కాలువల్ని దారి మళ్లించారు. చెరువు మధ్యలో ఎకరా స్థలంలో ఐలాండ్ నిర్మించి... చెరువు కట్టమీద నుంచి తీగల వంతెనను నిర్మించనున్నారు. తీగల వంతెనకు సంబంధించి సివిల్ పనులు పూర్తి కాగా.. తీగల్ని అమర్చి వంతెన పూర్తి చేయాల్సి ఉంది. 14 కోట్లతో చేపట్టిన ఈ పనులు 60శాతం పూర్తయ్యాయి. వంతెన పూర్తైతే మహబూబ్ నగర్ పట్టణానికే ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.