కొవిడ్ రహిత గ్రామాలు, పట్టణాలే లక్ష్యంగా మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాగం కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మండలాల్లో గ్రామాలు యూనిట్‌గా, మున్సిపాలిటీల్లో వార్డులు యూనిట్‌గా తీసుకుని... కరోనా రహిత ప్రాంతాలుగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఏప్రిల్ 15 నుంచి కేసులు మొదలై... ఇప్పటివరకు 42 నమోదయ్యాయి. అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ కోవిడ్ నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. గ్రామంలోని ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు రెండుసార్లు జ్వర సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్న వాళ్లను గుర్తించి మందులిచ్చారు. ఇంటికే పరిమితం చేసి కోలుకునే వరకు పర్యవేక్షించారు. గ్రామాన్ని క్రమం తప్పకుండా శానిటైజ్ చేశారు. కేసులు అధికంగా ఉన్నచోట మినీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆసుపత్రులకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో 12 క్రీయాశీల కేసులు ఉన్నాయి. వారం పది రోజుల్లో వారంతా హోం క్వారంటైన్ పూర్తి చేసుకోనున్నారు.
ముందే ఐసోలేషన్లోకి..
లక్షణాలు గుర్తించి ముందే ఐసోలేషన్‌లో ఉండటం, సరైన సమయానికి మందులు వాడటం, మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కోలుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పక్కాగా లాక్డౌన్ అమలు చేయడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్ల కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. కొవిడ్ లేని గ్రామంగా వెంకటాపూర్ తయారుకావాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.