అకాలవర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత రెండు రోజులుగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నిండా ముంచాయి. వరి ధాన్యం నేలకొరగగా... కొనుగోలు కేంద్రాల్లో ధాన్యమూ తడిసిముద్దయింది. మామిడి, నిమ్మతోటలకు అపార నష్టం వాటిల్లింది.
చేతికొచ్చిన పంట నీటి పాలు..
ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా 25.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంట నీటిపాలైంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనాజిపూర్, మాదారం గ్రామాల్లో మామిడి చెట్లు నేలకూలాయి. బొమ్మల రామారం, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది.
ధాన్యం వర్షార్పణమైంది..
యాదగిరిగుట్టలో రెండు పాడి గేదెలు మృతిచెందాయి. నకిరేకల్ మండలం నోములలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు ప్రాణాలు విడిచాయి. నల్గొండ పట్టణంలోని ఆర్జాలాబావి ఐకేపీ కేంద్రంలో ధాన్యం తడిసిపోవటంతో రైతులు ఆందోళకు దిగారు. తేమ సాకుతో అధికారులు కొనుగోలు చేయనందునే తమ ధాన్యం నీటిపాలైందని వాపోయారు. నల్గొండలోని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రైతుల ధర్నాతో వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. మిర్యాలగూడలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి వేములపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ, అడవిదేవులపల్లి మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఐకేపీ కేంద్రాలు, పీఏసీఎస్ సెంటర్లకు తీసుకువచ్చిన ధాన్యం వర్షార్పణమైంది.
కోమటిరెడ్డి ఆందోళన..