మహబూబ్నగర్ జిల్లాలో ఈ సంవత్సరం యాసంగిలో రికార్డు స్థాయిలో వరి పండింది. ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 190 కేంద్రాలను పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు రవాణా చేసేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ లారీలు పంపలేకపోయాయి. మిల్లుల వద్ద రోజుల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. లాక్డౌన్ అమల్లో ఉండటంతో కూలీల కొరత ఎదురైంది. పరిస్థితిని గమనించిన జిల్లా యంత్రాంగం ఆర్టీసీని రంగంలోకి దింపింది. ఈనెల 12న 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 5 కార్గో వాహనాలను ప్రభుత్వం జిల్లాకు పంపగా, సమస్య తీవ్రంగా ఉన్న చిన్నచింతకుంట మండలానికి వీటిని కేటాయించారు.
ధాన్యం రవాణా కోసం ఆర్టీసీ కార్గో సేవలు
కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేయడంలో రవాణా ఏజెన్సీలు విఫలం కావడంతో మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ధాన్యం రవాణా కోసం ఆర్టీసీ కార్గో సేవల్ని వినియోగించుకుంటోంది. ఇటీవలే కార్గో సేవలను ప్రారంభించిన ఆర్టీసీ ధాన్యం రవాణాకు అంగీకరించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
ఈనెల 17న 4 కార్గో వాహనాలు
ధాన్యం వర్షానికి తడవకుండా మిల్లులకు తరలించారు. ఈ నెల 17న మరో 4 కార్గో వాహనాలు జిల్లాకు రాగా వాటిని కూడా చిన్నచింతకుంట మండలానికే పంపించి ధాన్యాన్ని రవాణా చేశారు. మిల్లుల వద్ద కార్గో వాహనాలకు ఒక ప్రత్యేక వరుస, లారీలు, ట్రాక్టర్లకు మరో వరుస ఏర్పాటు చేసి.. త్వరగా ధాన్యాన్ని దింపేందుకు చర్యలు చేపట్టారు. ధాన్యం రవాణాలో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు కార్గో సేవల్ని ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. యాసంగిలో జిల్లాలో లక్షా 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటికే 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. పక్షం రోజుల్లో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుంది. ఈ ధాన్యం రవాణాకూ కార్గో సేవల్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు.