ప్రాజెక్టు నుంచి వదిలే నీరు ఆయకట్టుకు చేరడం కష్టంగా మారుతోంది. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ సరిగా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందులు రాకుండా అత్యవసర నిధిని అందుబాటులోకి తెచ్చినా దాని ఫలితం ఆయకట్టు రైతులకు చేరడం లేదు. ఎప్పటి మాదిరే నీళ్లు వృథాగా పోతుండగా రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రాజెక్టుల నుంచి ప్రధాన కాల్వల ద్వారా జలాశయాలు, చెరువులకు నీటి సరఫరా సజావుగానే సాగుతోంది. ఉపకాల్వలు, డిస్ట్రిబ్యూటరీల కింద నిర్వహణ మాత్రం తీసికట్టుగా మారుతోంది. ఎప్పటికప్పుడు పూడికతీత, చెట్లు, పొదల తొలగింపు చేపట్టక పోవడంతో నీరు వృథా అవుతోంది. గండ్లు పడిన చోట, లైనింగ్ కొట్టుకుపోయిన ప్రాంతాల్లో శాశ్వత మరమ్మతులు చేపట్టడం లేదు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందడం లేదు. కొన్ని చోట్ల రైతులే తూముల నిర్వహణ చేపడుతున్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి జిల్లాల్లోని భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల పరిధిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
*ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నాలుగు జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. కొల్లాపూర్, పెద్ద కొత్తపల్లి, కోడేరు, వనపర్తి తదితర మండలాల్లో ఉప కాల్వలు దెబ్బతిన్నాయి.
*అటవీ అనుమతులు రాక నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నుంచి మొదలయ్యే ప్రధాన కాల్వను పూర్తి స్థాయిలో నిర్మించలేదు. దీంతో నీళ్లు ముందుకు కదలడం కష్టంగా ఉంటోంది.
*జోగులాంబ గద్వాల జిల్లాలో రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) కాల్వల వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. చాలా ప్రాంతాల్లో షట్టర్లు లేవు. రైతులే రాళ్లు అడ్డుపెట్టి నిర్వహణ చేపడుతున్నారు. అయిజ, వడ్డేపల్లి, రాజోలి, మానవపాడు, ఉండవల్లి, ఇటిక్యాల మండలాల్లో 87 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 30 వేలకు మించి నీళ్లు రావడం లేదని రైతులు చెబుతున్నారు.
*భద్రాద్రి జిల్లాలో పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లోని పదివేల ఎకరాలకు సాగునీరు అందించే కిన్నెరసాని ప్రాజెక్టు ఉప కాల్వల్లో మొక్కలు, జమ్ము పెరిగింది.
*మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్ జలాశయం కింద ఉప కాల్వలకు మూడేళ్లుగా మరమ్మతులు లేవు.
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన డిస్ట్రిబ్యూటరీ కాల్వ ఇది. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ సమీపంలో అనేక చోట్ల లైనింగ్ దెబ్బతింది. పూడిక పేరుకుపోయింది. గడ్డి, చెట్లు మొలిచి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. రెండేళ్లుగా చివరి ఆయకట్టుకు నీళ్లు రావడం లేదని రైతులు చెబుతున్నారు.