2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్.. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను నిరాశ పరిచింది. కొత్త రైలు మార్గాల ఊసే లేదు. గతంలో సర్వే చేసిన రైలు మార్గాల ప్రస్తావన సైతం లేదు. కొవిడ్ మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ.. కాస్త ఇబ్బందుల్లో పడ్డ నేపథ్యంలో కేంద్రం కొత్తవాటికి జోలికి వెళ్లకుండా ఉన్న ప్రాజెక్టులకే నిధులు కేటాయించడానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి బడ్డెట్‌లో సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులకు 100 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ఏడాదితో పోల్చితే ఈ నిధులు తక్కువ. గతేడాది ఇదే డబ్లింగ్ పనుల కోసం.. 185 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రస్తుతం డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి.
ఏడాదికల్లా డబ్లింగ్ పూర్తి..
సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులు 2015-16లో మంజూరయ్యాయి. 85 కిలోమీటర్ల దూరానికి 744 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో.. పనులు ప్రతిపాదించారు. మొదటి ఏడాది 27 కోట్ల రూపాయులు.. 2016-17లో 80 కోట్లు.. 2017-18లో 50 కోట్లు.. 2018-19లో 250 కోట్లు, 2019-20లో 200 కోట్లు, 2020-21లో 185 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రస్తుతం షాద్‌నగర్ నుంచి గొల్లపల్లి వరకూ... డబ్లింగ్ పూర్తైంది. ఏడాది కల్లా పూర్తి చేయాలని.. రైల్వే అధికారులు ముందుకు సాగుతున్నారు.