ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 6 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. జోగులాంబ గద్వాల జిల్లాలోనే అత్యధికంగా 45 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. వీటిలో గద్వాల పట్టణంలో 31, అయిజలో 6, రాజోలిలో 4, వడ్డేపల్లిలో 2, ఇటిక్యాల, అలంపూర్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు కాగా.. వీరిలో 13 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 570 నమూనాలు పరీక్షల కోసం పంపించగా.. 529 మందికి కరోనా లేదని తేలింది. పాజిటివ్ కేసుల ప్రాథమిక సంబంధీకులు, కుటుంబసభ్యులు, అనుమానితులు 1,258 మంది ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు.
14 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి... కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వీటిలో గద్వాల పట్టణంలో అత్యధికంగా 8 కంటైన్మెంట్ జోన్లు ఉండగా... అయిజలో 2, రాజోలి, ఇటిక్యాల, అలంపూర్, వడ్డేపల్లిలో ఒక్కో కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కంటైన్మెంట్ జోన్లు, హోం క్వారంటైన్ నుంచి ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసులు, రెవిన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు హోం క్వారంటైన్ ఉన్న ఇళ్లను సందర్శించి కరోనా లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తున్నాయా ఎప్పటికప్పడు ఆరా తీస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలోనూ పక్షం రోజులకు పైగా కొత్త కేసులు ఏమీ లేవు. మొత్తం 11 కేసులు నమోదు కాగా... 3 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. మిగిలిన వాళ్లు గాంధీ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ క్వారంటైన్లో ఐదుగురు, ఐసోలేషన్లో ఒక్కరు మాత్రమే ఉన్నారు. సుమారు 313 మంది హోం క్వారంటైన్లో కొనసాగుతున్నారు. మొత్తం 338 నమూనాలు జిల్లా నుంచి పరీక్షలకు పంపితే... 329 మందికి కరోనా లేదని తేలింది. ఇప్పటి వరకు పంపిన అన్ని నమూనాల ఫలితాలు వెల్లడయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన 327 మంది 14 రోజుల హోం క్వారంటైన్ గడువు ముగించుకుని లాక్డౌన్ పాటిస్తున్నారు.