ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చదువులకు దూరమవుతున్న విద్యార్థులు - ఉపాధ్యాయుల పోస్టులు వివరాలు
Children's Education Joint Mahabubnagar District ఉపాధ్యాయుల కొరత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్రంగా ఉంది. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నాసరే ఈ ప్రాంతాల్లో టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల తల్లిదండ్రులు పిల్లలను పొలం పనులకు, ఇంటి దగ్గర కూర్చోపెడుతున్నారు. తమ పిల్లల చదువుల గురించి ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదని తల్లిదండ్రులు వాపోయారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 1,979 పోస్టులు ఖాళీ ఉండడంతో వాటిని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా
By
Published : Aug 28, 2022, 10:06 AM IST
Children's Education Joint Mahabubnagar District: ఉపాధ్యాయుల కొరతకు నిరసనగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తుపత్రాల ప్రాథమికోన్నత పాఠశాలలో 190 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు శనివారం బడి మానిపించారు. కొంతమంది పొలాలకు తీసుకెళ్లగా, మరికొంతమంది విద్యార్థులు ఇళ్ల వద్దే ఆడుకున్నారు. ఇక్కడ మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా ముగ్గురే ఉన్నారు. మూడు తరగతులకు బోధన జరుగుతుంటే మిగతా తరగతులవారు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
‘మన ఊరు.. మన బడి’ పేరుతో పాఠశాలల్లో వసతులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం పాఠాలు చెప్పాల్సిన గురువుల పోస్టులు భర్తీ చేయడం లేదు. దీంతో ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చోలేక విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లడమో, మారుమూల గ్రామాల్లోనైతే మానేయడమో చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని తల్లిదండ్రులు పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నా అధికారులు తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు.
అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం..ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 3,188 పాఠశాలలు ఉండగా 3.51 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 1,979 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మూడేళ్ల కిందట వరకు అవసరాల మేరకు విద్యా వాలంటీర్లను నియమించి బోధన సాగించేవారు. ప్రస్తుతం ఆ వ్యవస్థ లేదు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఈ ప్రభావం పడుతోంది. ఇటీవల వెలువడిన పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ సర్వేలో విద్యార్థుల అభ్యసనా, సామర్థ్యం ఫలితాలు 290మార్కులకుగాను ఉమ్మడి జిల్లాలో సగటు 150 మార్కులూ దాటలేదు.
*ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ముఖ్యంగా ప్రధానమైన గణితం, సైన్సు, ఆంగ్ల ఉపాధ్యాయులే లేకపోవడం విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతోంది.
*ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినా ఉపాధ్యాయులు లేరు. దీంతో తెలుగు, ఆంగ్ల మాధ్యమ విద్యార్థులను ఒక దగ్గరే కూర్చోబెట్టి బోధిస్తుండటంతో పూర్తి స్థాయిలో అర్థం కావడం లేదు.
*ప్రాథమిక పాఠశాలల్లో సుమారు అయిదుగురు ఉండాల్సిన చోట ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉంటున్నారు. వీరు రెండు తరగతులకు బోధిస్తున్న సమయంలో మిగతా తరగతుల విద్యార్థులు ఖాళీగా కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా ఒకరు సెలవు పెడితే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది.
మహబూబ్‌నగర్ అర్బన్ మండలం లక్ష్మీనాయక్ తండాలో అయిదు తరగతులకు 40 మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు తరచూ సెలవులో ఉంటారు. తండావాసులు ఇటీవల ఆందోళన చేశారు. ఓ ప్రజాప్రతినిధి విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులు హాజరవుతున్నా రెండు తరగతులకు పాఠాలు చెబుతుంటే మిగతా మూడు తరగతుల విద్యార్థులు ఖాళీగా కూర్చోవాల్సిందే.
నారాయణపేట జిల్లా మరికల్ మండలం కన్మనూరు ఉన్నత పాఠశాలలో 350 మంది విద్యార్థులు ఉన్నారు. 13 ఉపాధ్యాయ పోస్టులకుగాను అయిదు ఖాళీగా ఉన్నాయి. ఆంగ్లం, ఫిజికల్ సైన్సు ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ ఇటీవల గ్రామస్థులు ధర్నా చేశారు. డీఈవో వచ్చి డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను పంపిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటికీ ఎవరూ రాలేదు.
చదువు మానేస్తున్నారు..ఉపాధ్యాయులు కొరత విద్యార్థుల చదువుపై పడుతోంది. చాలా చోట్ల విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. సామాజిక ఆర్థిక గణాంక సర్వేలోనూ బడి మానేస్తున్న చిన్నారుల్లో రాష్ట్రంలోనే జోగులాంబ గద్వాల జిల్లా మొదటి స్థానంలో ఉంది. దీనికి ఉపాధ్యాయుల కొరతనూ ఒక కారణమే. 10 శాతానికిపైగా విద్యార్థులు ఉపాధ్యాయులు లేరన్న కారణంతోనే పాఠశాలలకు వెళ్లడం లేదు. ఈ జిల్లాల్లో తమకు ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు గతంలో న్యాయస్థానాలకు లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు సెకండరీ గ్రేడ్ టీచర్లు 1,429 స్కూల్ అసిస్టెంట్లు 391 లాంగ్వేజ్ పండిట్‌లు 123 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 36
పొలం పనుల్లో విద్యార్థులు:ఉపాధ్యాయులు సరిపడా లేరని ఆందోళన బాట పట్టిన తల్లిదండ్రులు శనివారం విద్యార్థులను బడికి రానీయకుండా పొలానికి తీసుకెళ్లిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలిక పరిధిలోని తుపత్రాలలో శనివారం చోటుచేసుకొంది. ప్రాథమికోన్నత పాఠశాలలో 1- 7వ తరగతి వరకు 190 మంది విద్యార్థులు చదువుతుండగా కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తున్నా సరైన బోధన సాగడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం బడి వద్ద ఆందోళన చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించేదాకా పిల్లలను బడికి పంపరాదని నిర్ణయించుకొన్నారు. శనివారం ఉదయం విద్యార్థులను పాఠశాలకు వెళ్లనివ్వకుండా కొంతమంది తల్లిదండ్రులు పొలాలకు తీసుకెళ్లారు.
పొలం పనుల్లో విద్యార్థులు
మిగతా విద్యార్థులు ఇళ్ల వద్దే ఉండిపోయారు. పాఠశాలకు ఉదయం ఏడుగురు విద్యారులు హాజరు కాగా వారితో ముగ్గురు ఉపాధ్యాయులు ప్రార్థన చేయించారు. అనంతరం వారినీ తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నామని, కనీసం వాలంటీర్లనైనా నియమించేదాకా పాఠశాలకు పంపేది లేదని తెగేసి చెబుతున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ రాఘవేంద్ర మాట్లాడుతూ బడిలో 190 మంది విద్యార్థులకు ముగ్గురే ఉపాధ్యాయులుండటంతో గ్రామస్థులమంతా ఏకమై ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. పాఠశాలలో చోటుచేసుకొన్న సంఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళతానని అయిజ ఎంఈవో నర్సింహులు అన్నారు .