అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు.. లక్షల ప్రజాధనం వృథా.. CC Cameras Useless in Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేయకుండా నివారించేందుకు మున్సిపల్ అధికారుల ప్రయోగం... ఆరంభశూరత్వంగానే మిగిలింది. గతంలో చెత్తపేరుకుపోతున్న ప్రధానమైన 50కూడళ్లను అధికారులు గుర్తించారు. మొదట్లో కార్మికులతో శుభ్రంచేయించి... రంగులతో ముగ్గులు వేయించి అక్కడ చెత్త వేయరాదని సూచనలు రాయించారు. రెండో ప్రయత్నంగా హెచ్చరికలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయినా చెత్తవేయడం ఆగలేదు.
చివరి ప్రయత్నంగా... మూడేళ్ల కిందట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అందుకు ఏడున్నర లక్షలు ఖర్చు చేశారు. నిర్వహణ పట్టించుకోలేదు. పారిశుద్ధ్య విభాగంలో వైఫై యాక్సెస్ ద్వారా చూసేందుకు డిస్‌ప్లే టీవీ అమర్చాలి. పర్యవేక్షణకు టెక్నీషియన్‌ను నియమించాలి. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా చెత్తవేసే వారిపై జరిమానా విధించాలి. ఇవేవీ అక్కడ జరగలేదు. ప్రస్తుతం 50 సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారిపోయాయి.
ప్రభుత్వాధికారులు కొత్తగా ప్రయోగాలు చేసినప్పుడు... వాటిని చిత్తశుద్ధితో చేపట్టాలి. ప్రజలకు ప్రయోజనం కలిగేలా నిరంతర పర్యవేక్షణతోపాటు... అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తూ మంచి ఫలితాలు రాబట్టాలి. కెమెరాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న అధికారుల తీరుపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పురపాలక శాఖ సీసీ కెమెరాల పర్యవేక్షణపై దృష్టిసారించి కూడళ్లల్లో చెత్త వేసే వారిపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
'ఎక్కువమంది ఉదయం బండ్ల మీద వచ్చి చెత్త వేసి వెళుతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పినా అలాగే వేస్తున్నారు. కెమెరాలు పెడితే ఏంటీ.. మమ్మల్ని ఏం చేస్తారని అంటున్నారు. సంవత్సరం నుంచి కెమెరాలు నడుస్తలేవు. అదే కెమెరాలు నడిస్తే చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. చెత్త వేసే కూడళ్ల దగ్గర చెత్త వేస్తే ఫైన్ విధిస్తారని బోర్డులు అయినా పెడితే బాగుంటుంది.'-స్థానిక ప్రజలు
ఇవీ చదవండి: