Bandi Sanjay: కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇవ్వటం లేదని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గద్వాలలో నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి లక్షా 68 వేల కోట్లు ఇచ్చిందని స్పష్టం చేశారు. మరో లక్షన్నర కోట్లు సంక్షేమ పథకాల రూపంలో వచ్చాయని వివరించారు. తెలంగాణకు నిధులిస్తున్న ప్రధాని మోదీని విమర్శిస్తారా అని ప్రశ్నించారు.
'ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్డీఎస్ పూర్తి చేసి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 8 ఏళ్లుగా నడిగడ్డ ప్రజలను మోసం చేశారు. రాబోయే ఆరు నెలల్లో ఆర్డీఎస్ ద్వారా నీళ్లిస్తామని కేంద్రం స్పష్టం చేసినది. కేఆర్‌ఎంబీ ద్వారా ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ మరమ్మతు. కేసీఆర్ చేయలేని పని కేంద్రం చేస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఆర్డీఎస్ అంశంలో తెలంగాణపై అన్యాయాన్ని పరిష్కరించమన్నాం. తెలంగాణకు నిధులిస్తున్న ప్రధాని మోదీని విమర్శిస్తారా? గద్వాల బహిరంగ సభ ఆర్డీఎస్ విజయోత్సవ సభ.' -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
గవర్నర్‌కు అవమానాలా? : సామాజిక మాధ్యమాల్లో గవర్నర్‌ను అవమానించటంపై భాజపా తమిళనాడు అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళిసై సౌందర్‌రాజన్‌ను అవమానిస్తే తెలంగాణలోని మహిళలను అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు. 2023 లో రాష్ట్రంలోని మహిళలు అందుకు సమాధానం చెబుతారని హెచ్చరించారు.