Diwali celebrations from 100 years: కౌకుంట్ల వారసుల దీపావళి శతాబ్ది వేడుకలు.. ఎన్నో ప్రత్యేకతలు ఇంట్లో శుభకార్యం జరిపితే బంధువులు ఇలా వచ్చి అలా వెళ్తున్న రోజులివి. ఉద్యోగం, వ్యాపారం పేరుతో తీరిక లేకుండా గడుపుతున్నారు. చుట్టాలతో సరదాగా గడిపేందుకు సమయమే దొరకని పరిస్థితులను చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఓ కుటుంబంలోని 150 మంది సభ్యులు.. దీపావళి వస్తే ఒక్కచోటుకి చేరిపోయారు. మూడ్రోజులపాటు పండుగను ఘనంగా జరుపుకుంటారు. వందేళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. నూరేళ్ల వేడుకకు ఈసారి మహబూబ్‌నగర్ వేదికైంది.
దీపావళి శతాబ్ది వేడుకలు..
మహబూబ్‌నగర్ సుభాష్‌నగర్‌కు చెందిన అంజమ్మ- చంద్రమౌళి దంపతుల ఇంట్లో.... ఈసారి కౌకుంట్ల వారసులు దీపావళి శతాబ్ది వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సుమారు 25 కుటుంబాలు, 150 మందికి సభ్యులు ఈ వేడుకకు హాజరుకావడంతో... ఇళ్లంతా సందడిగా మారింది.
1921 నుంచి..
మహబూబ్‌నగర్ జిల్లా నందిపేటకు చెందిన కౌకుంట్ల బాలమ్మ-వెంకయ్య దంపతులకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఉద్యోగం, వృత్తి రీత్యా ఎవరు ఎక్కడున్నా.... కౌకుంట్ల వంశస్తులంతా ఒకేచోట దీపావళి జరుపుకోవాలనే సంప్రదాయాన్ని 1921 నుంచి ఆ దంపతులు (Diwali celebrations from 100 years)ప్రారంభించారు. వారి కుమారులు, మనవలు ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ప్రతి దీపావళికి (Diwali celebrations)బాలమ్మ- వెంకయ్య వంశీయులంతా.... ఎవరో ఒకరి కుటుంబసభ్యుని ఇంట్లో కలుస్తారు. మూడ్రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. దీపావళి ముందు రోజు మంగళ హారతులు, పండుగ రోజు గౌరీ నోములు, మరుసటి రోజు సత్యనారాయణ వ్రతాలు మూకుమ్మడిగా చేస్తారు. పూజాది కార్యక్రమాలతో పాటు ఆటలు, పాటలు, నృత్యాలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మూడు రోజులపాటు వేడుకలు..
తాతలు, తండ్రులు, మనవలు, కుమారులు, కోడళ్లు, కూతుర్లు, అల్లుళ్లతో దీపావళి వేడుక సందడిగా సాగుతోంది. పండుగ నిర్వహణకు అయ్యే ఖర్చంతా సమష్టిగా భరిస్తారు. ఎవరెన్ని పనుల్లో తీరకలేకుండా ఉన్నా.... ఏడాదిలో మూడ్రోజులు మాత్రం తప్పకుండా దీపావళి వేడుకలకు హాజరవుతామని చెబుతున్నారు. కుటుంబాలు, మానవ సంబంధాలకు విలువ తగ్గుతున్న ఈ రోజుల్లో... పెద్దల సంప్రదాయాన్ని పాటిస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు కౌకుంట్ల వారసులు.
ఇవీచూడండి:Diwali Festival Special: దీపావళి విశిష్టత ఏంటి? ఈ వేడుక ఎన్ని రోజులు? దీపాలు ఎక్కడ వెలిగించాలి?