తెలంగాణ

telangana

ETV Bharat / city

'బరాబర్‌ బరిలో దిగుతా.. జులై 8న పార్టీ పేరు ప్రకటిస్తా'

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ ఆకాంక్ష నెరవేరలేదని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నించే పార్టీయే లేకుండా పోయిందన్న షర్మిల.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి రోజున కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగుల్లో భరోసా నింపేందుకు ఏప్రిల్‌ 15 నుంచి నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. ఎవరేమన్నా తాను తెలంగాణ బిడ్డనేనని ఉద్ఘాటించారు.

YS SHARMILA WAS CLARIFIED ANNOUNCING POLITICAL PARTY IN TELANGANA
బరాబర్‌ బరిలో దిగుతా.. జులై 8న పార్టీ పేరు ప్రకటిస్తా

By

Published : Apr 10, 2021, 4:23 AM IST

Updated : Apr 10, 2021, 5:15 AM IST

'బరాబర్‌ బరిలో దిగుతా.. జులై 8న పార్టీ పేరు ప్రకటిస్తా'


భౌతికంగా సాధించుకున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదని, స్వరాష్ట్ర ఫలాలు ప్రగతిభవన్‌ గేటు దాటలేదని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం సాధించుకుంటే అవన్నీ కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం నలిగిపోతోందని, కేసీఆర్‌ దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పరిస్థితులు వచ్చాయని ధ్వజమెత్తారు. శుక్రవారం ఖమ్మంలో తొలిసారి నిర్వహించిన సంకల్పసభలో ఆమె మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున జులై 8న కొత్తపార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తానన్నారు. ఇది తెలంగాణ ప్రజల పార్టీ అని, వారి సంక్షేమం కోసమే పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, ఇంట్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే తప్ప ఆ ఇంటికి ఉద్యోగం వచ్చేలా లేదని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనల సాధన కోసం ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేస్తానని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు ఉద్యోగ ప్రకటనలు వచ్చేవరకు దీక్షలు కొనసాగిస్తారని ప్రకటించారు. కార్యకర్తలు అధికారపార్టీకి భయపడవద్దని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల పునరాకృతి పేరిట రాష్ట్రంలో అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు తలా, తోక తీసేసి రీడిజైన్‌ పేరిట రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.30 లక్షల కోట్లకు పెంచేశారన్నారు. ఇందులో జరిగింది అవినీతి కాదా? అని ప్రశ్నించారు.షర్మిల ఇంకా ఏం మాట్లాడారంటే..

సింహం ఒంటరిగానే వస్తుంది. మేం తెరాస చెబితే, భాజపా అడిగితే, కాంగ్రెస్‌ పంపితే రాలేదు. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజాబాణమై వస్తున్నా. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నా. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వస్తున్నా.. అందుకే పార్టీ పెడుతున్నా. ఎవరు అవునన్నా, కాదన్నా.. ఎవరికి ఇష్టం ఉన్నా, లేకున్నా... నేను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే. ఈ గడ్డ మీద పెరిగా, చదువుకున్నా. బరాబర్‌ తెలంగాణలో నిలబడతా... ప్రజల కోసం కొట్లాడతా... పదవులు వచ్చినా, రాకపోయినా నిలబడతా. ప్రజల సంక్షేమం కోసం పోరాడతా... నాకు అవకాశం ఇవ్వాలో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. ఇస్తే ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తా.. లేకుంటే వారి తరఫున పోరాటం చేస్తా. కేసీఆర్‌ ఉద్యమ నాయకుడు. ఆయన పగ్గాలు చేపడితే అందరికీ న్యాయం జరుగుతుందని నేనూ అనుకున్నా. తప్పుచేస్తే ముక్కు నేలకు రాస్తానని కేసీఆర్‌ చెప్పారు. అందరిలా నేనూ నమ్మాను. రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా? ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా? లేదే.. బంగారు తెలంగాణ సాకారమైందా..? కల్వకుంట్ల కుటుంబానికి రాష్ట్రం బానిసైందా?

కేసీఆర్‌... ఈ ప్రశ్నలకు బదులేది?


‘‘వైఎస్‌ఆర్‌ అయిదున్నరేళ్ల కాలంలో 45 లక్షల పక్కా ఇళ్లు కట్టించారు. ఈ అయిదేళ్లలో ఎన్ని ఇళ్లు నిర్మించారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయి? దళితులకు ప్రకటించిన మూడెకరాల పథకం ఏమైంది? కొత్త కార్డులు, పింఛన్లు, కార్పొరేషన్లకు నిధుల్లేవు. సచివాలయంలో అడుగుపెట్టని సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆరే. తెలంగాణలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. లక్షల మంది రైతులకు రుణమాఫీ వాగ్దానం అమలు కాలేదు. యువకుల వలసలు ఆగలేదు. చదువులు కొనసాగడం లేదు. కేజీ టూ పీజీ విద్య ఏమైంది? వైఎస్‌ హయాంలో ఉచితంగా చదువు కోసం నూరుశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తే, ఇప్పుడు రూ.30 వేలు ఇస్తున్నారు.చేనేత తలరాతలు మారలేదు. కరోనా సమయంలో రోజువారీ కూలీల నుంచి ప్రైవేటు టీచర్ల వరకు ఎంతో మంది బాధపడ్డారు. బడుగు, బలహీనవర్గాల గురించి ధ్యాసే లేదు. కేసీఆర్‌ ప్రతి ఇంటికో ఉద్యోగమని మాటిచ్చారు. ఆ ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వలేదు. - షర్మిల


ఉద్యమాన్ని గౌరవిస్తున్నా: షర్మిల


తెలంగాణ ఉద్యమాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా. ఉద్యమంలో వందల మంది అమరులయ్యారు. అందరికీ జోహార్లు. వారి ప్రాణాలు పోకుండా తెలంగాణ సాధ్యమైతే బాగుండేది. రాష్ట్రం సాధించుకున్న తరువాత ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ఎవరు? 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నోటిఫికేషన్ల కోసం రోజుకొకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సునీల్‌ నాయక్‌ వీడియో సెల్ఫీ తీసుకుని చనిపోయారు. నడిరోడ్డుపై పట్టపగలే కిరాతకంగా లాయర్లను హత్య చేస్తే చర్యలేవి? గిరిజన మహిళ పోడుభూముల కోసం కొట్లాడుతుందని దారుణంగా కొట్టారని షర్మిల ఆరోపించారు


ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు..


ఎన్నికల హామీల గురించి కాంగ్రెస్‌ పార్టీ నిలదీయదు. అది తెరాసకు ఎమ్మెల్యేలను సరఫరా చేసే కంపెనీగా మారింది. భాజపా మతతత్వం గురించి రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. అభివృద్ధిపై, హామీలపై ఆ పార్టీ చెప్పుకొనేందుకు ఏమీ లేదు. పసుపు బోర్డు అన్నారు, ఇవ్వలేదు. తాటాకు అంటే ఈతాకు మాదిరి... పసుపు అంటే స్పైసెస్‌ బోర్డు ఇచ్చారు. తెలంగాణలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు. నీవు కొట్టినట్టు చేయి... నేను ఏడ్చినట్లు చేస్తానంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. పాలకపక్షాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించే బలమైన గొంతు తెలంగాణలో ఉండాలో లేదో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. - వైఎస్. షర్మిల


15 నుంచి నిరాహార దీక్ష


‘‘కేసీఆర్‌ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ఈ ఆత్మహత్యలు ఆగిపోవాలి. ఇంకో చావు కబురు మన చెవిన పడకముందే కేసీఆర్‌ ప్రభుత్వం నిద్ర లేవాలి. ఉద్యోగాల ప్రకటన జారీ చేయాలి. ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలి. లేని పక్షంలో ఆ నిరుద్యోగులకు భరోసా కోసం, కేసీఆర్‌ను నిద్రలేపడానికి ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేస్తా. నాలుగోరోజు నుంచి జిల్లాలో మా నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజూ రిలే నిరాహార దీక్షలు చేస్తారు. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసే వరకు దీక్షలు ఆగవు. నిరుద్యోగ యువకులకు విన్నపం. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ప్రాణం చాలా విలువైనది. అక్కగా అడుగుతున్నా. కొంచెం ఓపిక పట్టాలి.. మీ పక్షాన పోరాటం చేస్తా. మంచి రోజులు వస్తాయి. రాజన్న పాలన వస్తుంది. జై తెలంగాణ’’ అంటూ షర్మిల ప్రసంగం ముగించారు.

నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా

‘‘షర్మిల తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేస్తుంది. బతుకులు తెలుసుకుంటుంది. మీ ముందుకు వస్తుంది. ఈ గడ్డపై, ప్రజలపై మమకారం నింపుకుని మేలు చేయాలని నా బిడ్డ అడుగులు వేస్తోంది. నా బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నా. ఇక నా బిడ్డ కాదు మీ బిడ్డ. ఆశీర్వదించండి’’ అని వైఎస్‌ విజయమ్మ ప్రజలను కోరారు. ఖమ్మంలో శుక్రవారం సాయంత్రం షర్మిల సంకల్ప సభలో ఆమె మాట్లాడారు.

నీతివంతమైన రాజకీయాలతో ప్రతి రైతు, మహిళలు అన్ని వర్గాల వారి సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేస్తుందని నమ్ముతున్నా. ఇది కఠోరమైనదైనా, కఠినమైనదైనా.. దేన్నైనా ఎదురించే వైఎస్‌ఆర్‌ రక్తం ఆమెలో ఉంది. ఇకపై తెలంగాణ కోసమే మాట్లాడుతుంది. ఏదైనా చేస్తుంది. రాష్ట్ర ప్రజలు చేయి అందించాలని కోరుతున్నా. తెలంగాణ వచ్చాక వైకాపాకు ఆధిక్యత ఇచ్చిన జిల్లా ఖమ్మమే. ఇప్పుడూ అదే ఆత్మీయతను మీలో చూస్తున్నా. వాళ్ల నాన్న నడిచిన బాటలో నడుస్తూ ఖమ్మం జిల్లా నుంచి తన రాజకీయ ప్రస్తానంలో మొదటి అడుగు వేయడానికి షర్మిల ముందుకొచ్చింది. రాజశేఖర్‌రెడ్డి భార్యగా, షర్మిలకు అమ్మగా ఆమెను దీవించండి అని అడగడానికి వచ్చా. వైఎస్‌ఆర్‌ కోసం 700 మంది ప్రాణాలు తీసుకున్నారు. చనిపోయిన వారిలో ఈ గడ్డవారే ఎక్కువగా ఉన్నారు. ఓదార్పు పాదయాత్రలలో మీరు చూపిన ప్రేమను చూసిన షర్మిల తన జీవితం తెలంగాణతో ముడిపడి ఉందని చెబితే నేను సంతోషించాను. ఏ పార్టీ అయినా వైఎస్‌ను ఒప్పుకోవాల్సిందే. ఆ ఒక్కడు ఉంటే ఇలా ఉండేది కాదని అంతా చెబుతున్నారు. అదే విలువలతో అదే చిత్తశుద్ధితో షర్మిల మీ ముందుకు వస్తోంది. ఆశీర్వదించండి -వైఎస్‌ విజయమ్మ.

దారి పొడవునా స్వాగతం..

ఖమ్మంలో షర్మిల శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సభ కోలాహలంగా సాగింది. ఫిబ్రవరి 9న తెలంగాణలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె తన తండ్రి రాజశేఖరరెడ్డి 18 ఏళ్ల క్రితం పాదయాత్ర ప్రారంభించిన ఏప్రిల్‌ 9వ తేదీనే ఎంచుకుని ఖమ్మం సభను నిర్వహించారు. తన రాజకీయ లక్ష్యాన్ని ప్రకటించారు. వేల మంది అభిమానులు పాల్గొన్న ఈ సభలో 40 నిమిషాలు ప్రసంగించారు. ఏపూరి సోమన్న ఆటాపాటా ఆకట్టుకుంది. సభా ప్రాంగణం నిండిపోగా బయట కూడా అభిమానులు ప్రసంగాన్ని విన్నారు. సంకల్ప సభలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన షర్మిలకు బోనాలు, కోలాటాలు, డప్పు నృత్యాలతో దారిపొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. సూర్యాపేటలో పూలు చల్లారు. చివ్వెంలలో సోమిరెడ్డి అనే నాయకుడి ఇంట్లో భోజనం చేశారు. యువకులు ద్విచక్రవాహనాలతో కాన్వాయ్‌ ముందు ర్యాలీగా పాల్గొన్నారు. సాయంత్రం 6.30 గంటలకు ఖమ్మంలోకి ప్రవేశించిన షర్మిల స్థానిక నాయకులతో ఓపెన్‌ టాప్‌ వాహనంపై మైదానానికి చేరుకున్నారు.


వైఎస్‌ చేతి గడియారం ధరించి..


సభకు బయలుదేరిన షర్మిల మొదట తన తండ్రి వైఎస్‌ చేతి గడియారాన్ని ధరించారు. తన భార్య షర్మిల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న మార్పును తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు అనిల్‌కుమార్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇవీ చూడండి:ఈనెల 12న వరంగల్​లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

Last Updated : Apr 10, 2021, 5:15 AM IST

ABOUT THE AUTHOR

...view details