లాభాల్లో భారీ వృద్ధిని సాధించినందుకు సింగరేణిని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించారు. గతేడాది ఏప్రిల్-జులైతో పోల్చితే 2021లో అదే సమయంలో లాభాల్లో 364 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 2020-21 మొదటి త్రైమాసికంలో రూ.303 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా.. 2021-22లో మొదటి మూడు నెలల్లో రూ.800 కోట్ల లాభాన్ని ఆర్జించింది. బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిని రికార్డు స్థాయిలో వృద్ధి సాధించటంతో ఈ స్థాయి లాభాలు వచ్చాయి. ఆదాయం పరంగానూ గతేడాదితో పోల్చితే 72 శాతం వృద్ధి నమోదైంది.
లాభాలు ఆర్జించాం
కరోనా పరిస్థితిని అధిగమించి ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.8,180 కోట్ల టర్నోవర్ సాధించి రికార్డు నెలకొల్పామని సింగరేణి సీఎండీ శ్రీధర్ గురువారం వెల్లడించారు. గతేడాది ఇదే కాలానికి సింగరేణి సాధించిన రూ.4,748 కోట్ల టర్నోవర్‌పై ఇది 72 శాతం అధికం కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో 800 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించినట్లు శ్రీధర్ తెలిపారు.
గతేడాది ఇదే కాలానికి 303 కోట్ల రూపాయల నష్టాలను చవిచూసిన కంపెనీ ఈ ఏడాది సాధించిన అద్భుతమైన టర్నోవర్ రీత్యా.. 364 శాతం వృద్ధితో లాభాలను సాధించినట్లు సీఎండీ వివరించారు. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.6,949 కోట్ల టర్నోవర్ సాధించి.. గతేడాది ఇదే కాలానికి సాధించిన రూ.3,816 కోట్ల బొగ్గు అమ్మకాల టర్నోవర్‌పై 82 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు.
ఇదీచూడండి:Singareni Turnover: సింగరేణి రికార్డు.. మొదటి నాలుగు నెలల్లోనే రూ.800 కోట్ల లాభాలు