తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేసీఆర్​ జాతీయ రాజకీయాలతో భాజపాకు వణుకుపుడుతుంది' - కేసీఆర్‌కు కృతజ్ఞత సభ

కేసీఆర్​ జాతీయ రాజకీయాలతో భాజపాకు వణుకుపుడుతుందని తెరాస ఎంపీలు ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో మోదీని మించిన అనుభవమున్న నేత కేసీఆర్‌ అని.. దేశంలో మార్పు కోసం ఆయన భుజం కలిపి నడుస్తామని తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఖమ్మం జిల్లాకు వచ్చిన అభిమాన నేతలకు.. తెరాస నాయకులు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

trs-mps-comments-on-bjp-in-khammam-meeting
trs-mps-comments-on-bjp-in-khammam-meeting

By

Published : Jun 19, 2022, 2:57 AM IST

ఖమ్మం జిల్లాలో ఉప్పు నిప్పులా ఉంటున్న అధికార పార్టీ నేతలంతా మరోసారి ఒకే వేదికపైకి వచ్చి.. గులాబీ శ్రేణుల్లో జోష్‌ను నింపారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి సొంత జిల్లాకు వచ్చిన వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డికి తెరాస కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జిల్లా సరిహద్దుల్లోని నాయకన్‌గూడెం చేరుకున్న అభిమాన నేతలకు తెరాస నాయకులు, పార్టీ కార్యకర్తలు అడుగడుగునా స్వాగతం పలికారు. వందలాది ద్విచక్రవాహనాలు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పలుచోట్ల భారీ గజమాలతో సత్కరించి.... స్వాగతం పలికారు. అనంతరం ఖమ్మంలో నిర్వహించిన 'కేసీఆర్‌కు కృతజ్ఞత సభ'లో రవిచంద్ర, పార్థసారథిరెడ్డితో పాటు.... ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు పాల్గొన్నారు. కేసీఆర్‌ చేపట్టే కార్యక్రమాలన్నింటిలో భాగస్వాములై... వాటిని విజయపథంలో నడిపించేందుకు ముందుండి పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు తెలిపారు.

రాష్ట్రం ఆవిర్భవించిన 8ఏళ్లలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్‌కు... దేశం గతిని మార్చే సత్తా ఉందని నేతలు తెలిపారు. ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న భాజపాకు ప్రజలు బుద్ధిచెప్పాల్సిన అవసరముందన్నారు. కర్షకులకు గతంలో క్షమాపణలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.... యువతపై తూటాలు పేల్చినందుకు మరోసారి దిగిరాక తప్పదని మంత్రి పువ్వాడ, ఎంపీ నామా జోస్యం చెప్పారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాస శ్రేణుల్లో చాలారోజుల తర్వాత కొత్త ఉత్సాహం కనిపించింది. వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డిల రాక సందర్భంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన ముఖ్య నేతలంతా ఒకే వేదికపై కనిపించటంతో సందడి వాతావరణం నెలకొంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. నేతలంతా కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే ముఖ్య నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి.... ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మినహా హాజరైన మిగతా నేతలంతా... కలిపి పనిచేస్తూ... వచ్చే ఎన్నికల్లో పదికిపది సీట్లు కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని ప్రకటించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details