తెలంగాణ

telangana

By

Published : Nov 15, 2019, 4:06 AM IST

Updated : Nov 15, 2019, 7:25 AM IST

ETV Bharat / city

ప్రజల మనసు గెలిచిన వైద్యుడు... ఈ వన ప్రేమికుడు

ఆయనో వైద్యుడు. జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాలలో తన సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ జన్మభూమిని మరవలేదు. మారుమూల గ్రామంలో పుట్టి ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడ్డాడు. రోజులో ఒక్కసారైనా ఊరి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషిచేస్తున్నాడు. విద్య, వైద్యం, మధ్యపాన నిషేధం వంటి కార్యక్రమాలతో సేవామూర్తిగా స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడు.

ప్రజల మనసు గెలిచిన "వన ప్రేమికుడు"..!

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని మారుమూల గ్రామం కేసుపల్లి డాక్టర్‌ నాగేశ్వరరావు స్వగ్రామం. 2005 వరకు ఆ గ్రామానికి పక్కా రహదారి లేదు. అలాంటి కుగ్రామం నుంచి కష్టపడి చదివి ఎంబీబీఎస్‌ ఎండీ, డీఎం పూర్తి చేశారు. ఖమ్మంలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు సాధించారు. పేదలకోసం ఆసుపత్రి ప్రారంభించి సొంతూరు కేసుపల్లికి అండగా ఉంటున్నారు.

42 గ్రామాల్లో... 50వేల మొక్కలు పంపిణీ
సొంతూరిలో ఆరంభించిన సేవలు మండలం యూనిట్‌గా కొనసాగిస్తున్నారు. ఏటా లక్షకు పైగా వివిధ గ్రామాల్లో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. టీఎల్‌పేట నుంచి కేసుపల్లి వరకు రహదారి పొడవునా నాటిన మొక్కలు ప్రస్తుతం పెద్ద వృక్షాలుగా మారాయి. ఇప్పటి వరకు దాదాపు 42 గ్రామాల్లో ప్రజలకు 50వేల కొబ్బరి మొక్కలు పంపిణీ చేశారు. వీటితోపాటు పండ్లమొక్కలు, నీడనిచ్చే, పూల మొక్కలు అందించి వన ప్రేమికుడిగా ప్రజల మనసుల్లో నిలిచారు.

బసవమ్మ మోమోరియల్‌ ట్రస్టు సేవలు
ఏన్కూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కోసం బసవమ్మ మోమోరియల్‌ ట్రస్టు ద్వారా సహకారం అందించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల.. రోగులకు అవసరమైన పరికరాలు, భవనం మరమ్మతులు, మరుగుదొడ్లు, ఆసుపత్రి ఆవరణ బాగు చేయించారు. రూ.3 లక్షలతో ఆసుపత్రి మరమ్మతులతో పాటు రహదారి ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రూ.60వేలతో పిల్లలకు మంచినీటి వసతి సమకూర్చారు.

వయోజనులకు రాత్రి బడి
కేసుపల్లిలో గ్రంథాలయం నిర్మించి గ్రామస్థులకు విజ్ఞానం నింపే విధంగా ఏర్పాట్లు చేశారు. వయోజనులకు రాత్రి బడిని కొనసాగిస్తూ అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్నారు. తమ బోరుబావిని గ్రామంలో నీటి సరఫరాకు అందిస్తూ ప్రత్యేకంగా పైపులైన్‌ ఏర్పాటు చేయించారు. శుద్ధజల ప్లాంటు నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు తన వంతు సహకారం అందిస్తున్నారు.

సేవా కార్యక్రమాలు

  1. తొలుత తన ఆసుపత్రికి వచ్చే కేసుపల్లి వాసులకు మాత్రమే ఉచిత వైద్య సదుపాయం కల్పించారు.
  2. ఆ తర్వాత గ్రామంలోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తూ ప్రజలు వ్యాధులకు గురికాకుండా చర్యలు చేపట్టారు. స్వైన్‌ప్లూ, డెంగీ, గన్యా వంటి వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.
  3. దాదాపు 42 గ్రామాల్లో విషజ్వరాల బారిన పడకుండా ఫాగింగ్‌, అవసరమైన చోట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.
  4. ప్రధానంగా విద్య, వైద్యం, పర్యావరణం అంశాలపై దృష్టిపెట్టి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
  5. తల్లిదండ్రులు నారాయణ, బసవమ్మ మోమోరియల్‌ ట్రస్టును ఏర్పాటు చేసి సేవలు కొనసాగిస్తున్నారు.
  6. తాను చదువుకున్న పాఠశాలకు చుట్టూ ప్రహరీ, భవనాలకు స్లాబు, మరమ్మతులు, ఇనుప తలుపులు, కిటికీలు, క్రీడా వస్తువులు, ఉపాధ్యాయులకు కావాల్సిన కార్యాలయ సామగ్రి, పిల్లలకు బల్లాలు ఇచ్చారు.
  7. హరితహారం కంటే మందే మండలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పదేళ్ల క్రితం ఏన్కూరు పాఠశాలతోపాటు కేసుపల్లిలో నాటిన మొక్కలు ప్రస్తుతం వృక్షాలుగా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
  8. గడిచిన 15ఏళ్లలో 5 లక్షలకు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షణ చేపట్టారు. వనసేవకుడిగానూ తాను పుట్టి పెరిగిన మండలంలో సేవలందిస్తున్నారు.

కలెక్టర్‌, ఎస్పీ ప్రశంస
మిషన్‌ భగీరథకు ముందే పదేళ్ల క్రితం నుంచే నీటి వనరులు మెరుగు పరిచే పనులు చేపడుతున్నారు. కేసుపల్లి చెరువును అభివృద్ధి చేసి చేపలు పెంచి గ్రామానికి ఆదాయ వనరులు వచ్చే విధంగా తోడ్పడుతున్నారు. వైద్యుడిగా నాగేశ్వరరావు బిజీగా ఉన్న సమయంలో తన సేవా కార్యక్రమాలను ఆయన సతీమణి శైలజ కొనసాగిస్తున్నారు. పూర్వ కలెక్టర్‌ నాగేశ్వరరావు, ఎస్పీ అనిల్‌కుమార్‌తోపాటు పలువురు ఆ గ్రామాన్ని సందర్శించి నాగేశ్వరరావు సేవలు అభినందిచారు.

ప్రజల మనసు గెలిచిన "వన ప్రేమికుడు"..!

ఇదీ చదవండి: ఆర్టీసీ ఐకాస భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Last Updated : Nov 15, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details